Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాల్మీకిస్తుతి

శ్రీనాథుని భీమఖండము [1-5]

శా.

శ్లోకంబుల్ శతకోటిఁ గాండములుగా సూత్రించి రామాయణం
బేకైకాక్షర మెల్లపాపములు మాయింపంగ నిర్మించి సు
శ్లోకుండైన పురాణసంయమివరుం జూతు న్మనోవీథి వా
ల్మీకిన్ బ్రహపదావతీకర్ణకవితాలీలావతీవల్లభున్.

99

సుకవిప్రశంస

శ్రీనాథుని భీమఖండము [1-7]

సీ.

ప్రణుతింతు రసభావభావనామహనీయ
              కవితాసముల్లాసుఁ గాళిదాసు
గణుతింతు నిరవద్యగద్యపద్యనిబంధ
              పరితోషితస్థాణు భట్టబాణు
భజియింతు సాహిత్యపదవీమహారాజ్య
              భద్రాసనాసీనుఁ బ్రవరసేను
వర్ణింతు నంభోధివార్వీచిసంభార
              గంభీరవాక్సముత్కర్షు హర్షు


తే.

భాస శివభద్ర సౌమిల్ల భల్లటులకు
మాఘ భారవి బిల్హణ మల్హణులకు
భట్టి చిత్తప కవి దండిపండితులకుఁ
గీలు కొల్పుదు నొసలిపైఁ గేలుదోయి.

100

[1-9]

ఉ.

పంచమవేదమై పరఁగు భారతసంహిత నంధ్రభాషఁ గా
వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

101

పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ - కుమారనైషధము

సీ.

ఈశుచేఁ గాంచి సాహిత్యవిద్య ధరిత్రి
              నిల్పినయట్టి పాణిని భజించి
శ్లోకార్థమునఁ జంద్రజూటు మెప్పించి యి
              ష్టార్థముల్ గన్న మల్హణు నుతించి
గద్యంబు చెప్పి శంకరునిచేఁ గరములు
              ప్రతిభతోఁ బడసిన బాణుఁ దలచి