Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావిలాసము

సీ.

పృథులవిశ్వంభరారథమున కెదురుగాఁ
              బూన్పించె నెవ్వఁడు పువ్వుఁదేరు
కాంచనాచలకార్ముకమునకు సాటిగాఁ
              జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు
[1]నవిహతపాశుపతాస్త్రమ్మునకు వాఁడి
              మిగిలించె నెవ్వండు చిగురుఁదూపు
నతులితామరదానవాదిబలంబుల
              గెలిపించె నెవ్వఁ డయ్యళిబలంబు


తే.

నట్టి జగజెట్టి మన్మథుఁ డఖిలలోక
ములకు వెఱగొంగ జీవుల మూలకంద
మతనియిలు సొచ్చి వెడలనియతఁడు గలఁడె
యతనియమ్ములఁ బడకున్నయతఁడు గలఁడె.

95

వ్యాసస్తుతి

తిక్కనసోమయాజి – భీష్మపర్వము [6-1-71]

ఉ.

ప్రాంశుపయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశుజటచ్ఛటాభరణు నాగమపుంజపదార్థ[తత్త్వ]ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీ
వంశవివర్ధనున్ ద్రిదశవందితు సాత్యవతేయుఁ గొల్చెదన్.

96

శ్రీనాథుని భీమఖండము [1-6]

మ.

తలఁతున్ భారతసంహితాధ్యయనవిద్యా[2]నిర్మితిప్రక్రియా
నలినప్రోద్భవునిన్ గళిందతనయాంతర్వేదిపుణ్యస్థలీ
పులినాభోగకృతావతారు నపరాంభోజాక్షు నక్షీణని
ర్మలసాహిత్యకళాసమృద్ధికయి పారాశర్యమౌనీశ్వరున్.

97

కూచిరాజు ఎఱ్ఱయ - సకలపురాణసారము

ఉ.

నీరజనేత్ర కృష్ణమృగనేత్ర నవారుణనేత్ర వృష్టివ
న్నీరదగాత్రు వేదగణనిర్మలసూత్రుఁ బురాణభారత
స్ఫారకథాచరిత్రు ఘనపాపనికుంజలతాలవిత్రు దు
ర్వారతపస్సమాధిజితశత్రుఁ బరాశరపుత్త్రుఁ గొల్చెదన్.

98
  1. క.అవిరళ
  2. క.నిర్మల