[ధూర్జటి – శ్రీ]కాళహస్తిమాహాత్మ్యము [2-136]
చ. |
కుముదవనాళికిన్ బలుపు కోకము లాటకు నిల్పు దిగ్వధూ
సమితికిఁ బూఁత, మేత నవశాబచకోరకరాజి, కిందుకాం
తములకు ద్రావకం బగుచు దర్పకశాస్త్రనిరూపితౌషధ
క్రమములఁ బండువెన్నెలలు గాసె ధరాస్థలి మోహనంబుగన్.
| 209
|
చకోరసంవాదము
[1]జక్కన - సాహసాంకము [6-71]
సీ. |
పసగల వెన్నెల మిసిమి పుక్కిటఁ బట్టి
పొసఁగఁ బిల్లల [2]నోళ్లఁ బోసి పోసి
నున్నని [3]క్రియ్యని వెన్నెల తుంపర
యుహ్వునఁ జెలులపై నుమిసి యుమిసి
కమ్మని వెన్నెల కడుపు నిండఁగఁ గ్రోలి
[4]తెలివెక్కి గఱ్ఱనఁ [5]ద్రేన్చి త్రేన్చి
కన్నిచ్చలకు వచ్చు వెన్నెల క్రొన్నురు
వేఱి వే ప్రియురాండ్ర కిచ్చి యిచ్చి
|
|
తే. |
తఱచు వెన్నెలల గుంపులఁ దాఱి తాఱి
యీఱమగు వెన్నెలలోనఁ దూఱి తూఱి
పలుచనగు వెన్నెలలోనఁ బరువు లిడుచు
[6]మెలగెఁ జెక్కు చకోరంపుఁబులుఁగు గవలు.
| 210
|
[7]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-139]
ఉ. |
పిల్లల కెల్ల మేపి మును పేర్చిన వెన్నెలతీఁగెలోఁ గొనల్
కొల్లగఁ దారునుం బతులు గుత్తుకబంటిగ మేసి గూండ్లలో
వెల్లులు గూడఁ [8]బోసికొను వేడుకఁ బుక్కిటఁ బట్టి చీఁకటుల్
ఝల్లునఁ బాఱగా నుమియఁ జాగిన కోరికలం, జకోరికల్.
| 211
|
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-160]
చ. |
ఎఱుకలు దిద్ది కంధరము లెత్తి మొగిం జరలాట మున్నుగాఁ
బఱచుచు లేఁతవెన్నెలలు పారణసేయుచు మించి చంచులన్
నఱకినఁ దోనపుట్టు కిరణంపుఁగొనల్ గొన మోము మోముతో
నిఱియగఁ జేర్చి ప్రేయసుల కిచ్చుచునాడె దివిం జకోరికల్.
| 212
|
- ↑ గ.భైరవుఁడు - శ్రీరంగమాహాత్మ్యము
- ↑ క.గ.నోర
- ↑ క.క్రియ్యను, గ.వయసు
- ↑ క.తెలపెక్కి, గ.తేనువెక్కి
- ↑ క.గ్రోలిద్రేచి
- ↑ గ.జెలగె
- ↑ సుంకసాల
- ↑ గ.బారుకొని