Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దూతికావాక్యములు

[ఎఱ్ఱయ] – కొక్కోకము

[1]సీ.

గౌతమమునిరాజు కాంత గాదె యహల్య
              దేవేంద్రుతోఁ గోర్కెఁ దీర్చుకొనదె
[2]ఆదిత్యగురుకాంత గాదె తారాదేవి
              శిష్యచంద్రుని ప్రియుఁ జేసికొనియె
దాశరాజుతనూజ గాదె యోజనగంధి
              సమ్మతింపదె పరాశరునిఁ గవయ
పరమపావని గాదె భాగీరథీగంగ
              శంతనుతో రతి సల్పుకొనియె


తే.

ద్రౌపదీకాంత కేవురు ధవులు గారె
గొల్లెతలు కృష్ణుతో నొనఁగూడి మనరె
కానఁ దొల్లిటివారును గలసినారు
జారుఁ బొందిన నేమి దోసంబు సతికి.

178

[?]

[3]సీ.

కాంతబింబాధరక్షతము నాథుఁడు గన్నఁ
              జిలుక ముద్దాడె నీ చెలువ యనుచుఁ
గొమ్మ చెక్కిలి యొత్తు కోరు నాథుఁడు గన్నఁ
              గేతకిఁ గొట్టె నీ నాతి యనుచు
సుదతి కేశములు జుంజురులు నాథుఁడు గన్నఁ
              బూఁబొద దూఱె నీ పొలఁతి యనుచు
రమణి మేనునఁ జెట్టరాఁగ నాథుఁడు గన్న
              నీరెండ గ్రాఁగె నీ నారి యనుచు


తే.

నబ్జముఖి దప్పి ప్రాణనాయకుఁడు గన్నఁ
గొలుసు గంపెడు దంపె నీ కొమ్మ యనుచు
లలన జారునిఁ బొందిన లక్షణములు
పురుషుఁ డీక్షించ దూతిక పోయి బొంకు.

179

ముక్కు తిమ్మన – పారిజాతము [2-52]

[4]చ.

వలిపెము గట్టి హారములు వైచి పటీరము మై నలంది జా
దులు నెఱిగొప్పునం దుఱిమి త్రోవను బోయితిమేనిఁ దాఁకియున్
దలఁచెడివారు లేరని మనంబు కలంకలఁ దేర్చు జారకాం
తల సమయస్థలంబులకుఁ దార్చిరి దూతిక లట్టి వెన్నెలన్‌.

180
  1. క.లో లేదు.
  2. గ.అంత్యగురుని
  3. క.లో లేదు.
  4. క.లో లేదు.