Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావిలాసము

[1]సీ.

పదనిల్చి పాపిటపట్టు నున్నఁగ దువ్వి
              చెదలఁ ద్రొక్కెడు కొప్పు చెంపఁ దాపి
వడలి కంకటి తొడవులుగాఁగ నొసలిపై
              పొసగంగఁ గాటుకబొట్టు పెట్టి
పని లేక తిరుగుచుఁ బాటలు పాడుచుఁ
              జదురాడుచును దిగసాగఁ బెట్టి
నవ్వుచు మురిసి సన్నలఁ జేరి పలుచని
              మరువునఁ దనుఁబొందు మత్తికాని


తే.

దిబ్బ లెల్లను వినువారి కుబ్బు గాఁగ
బదను పదనున నంతలఁ బరయుఁ జింత
గవయకూడల మదనుండు కలయ [2]నెలచి
గుదియఁగొను మోదుపువ్వుల కోల విడిచి.

122

వేశ్యమాత

[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-110]

సీ.

భావింపఁ దీర్థపురేవు కోరు మొసళ్ళు
              చెఱకుపైఁ గ్రొవ్వాడి కఱకుఁ బేళ్ళు
గెంటని తేనియజుంటిపై నీఁగలు
              పూచిన మొగలిపైఁ బొరలు ముండ్లు
పంటచేలకు నాఁగఁబడిన యోధంబులు
              గంధంపుఁదీవెల కాలఫణులు
కదలక పెన్నిధిఁ గాచు దయ్యంబులు
              రచ్చఠావుల బొమ్మరక్కసియలు


ఆ.

లంజతల్లు లనఁగ లక్షింపఁగా నిట్టి
కట్టిడులకు నలువ కరుణ లేక
బ్రాఁతిమాలినట్టి బ్రతుకులు నిడుపుగాఁ
జేసి విడుల గోడు వోసికొనియె.

123
  1. క-లో లేదు.
  2. గ.వెలచి
  3. సుంక