Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామలింగకవి – హరిలీలావిలాసము

తే.

భానుశశిమండలంబుల లో నడంచి
యిరులు పెనువానఁ గురియుచు నేపు చూపు
రాత్రి వర్షర్తువునఁ బుట్టె బ్రతి గృహాక
రములఁ బటుదీపవైడూర్యరత్నసమితి.

88

ముక్కు తిమ్మన – పారిజాతము [2-36]

చ.

మొనపిన దీపికానికరముల్‌ గృహకార్యగతాభిసారికా
వనితల యూర్పుగాడ్పుల నెపంబునఁ గంపము నొంద నోడకుం
డని తిమిరంబు తా నభయహస్తము లిచ్చె ననంగ వానిపైఁ
గనుఁగొనఁ బొల్చె నంకురితకజ్జలముల్ నవధూమమాలికల్‌.

89

విదియచంద్రుఁడు

మద్దికాయల మల్లయ్య – రేవతీపరిణయము

చ.

నిలయతమఃప్రతా[న]ము గణింప మఱుంగులు సొచ్చినట్టుగా
నలరు పిఱిందినీడలు రతాంతదుకూలపరిగ్రహత్వరా
కలితవిలాసినీనివహకౌతుకహేతువులై చెలంగ ను
జ్జ్వలరుచి మించె గేహముల సంపెఁగమొగ్గల వంటి దీపముల్.

90

రావిపాటి త్రపురాంతకుఁడు - తారావళి

మ.

చరమక్ష్మాధరచారుసింహముఖదంష్ట్రాకోటియో నాఁగ నం
బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరేఖప్రస్ఫురద్గర్వసం
హరణక్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల మీ రేఖ ని
త్యరుచిన్ బోల్పఁగఁ బెంపగున్ విదియచంద్రా! రోహిణీవల్లభా!

91


మ.

అమితధ్వాంతతమాలవల్లిలవనవ్యాపారపారీణదా
త్రమొ సౌగంధికషండకుట్మలకుటీరాజీసముద్ఘాటన
క్రమ[1]నిర్వాహధురీణకుంచికయొ నాగం బెంపున [2]న్నీ కళా
రమణీయత్వము చూడ నొ ప్పెసఁగుఁ జంద్రా! రోహిణీవల్లభా!

92
  1. క.నిర్వాణ
  2. క.నీరవా