Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బంకజనేత్ర గౌతముని పంపున లాజలు దోయిలించి ధూ
మాంకునియందు వ్రేల్చె దరహాసము ఱెప్పలలోనఁ దాఁచుచున్.

140

పతివ్రతాలక్షణము

కూచి ఎఱ్ఱయ్య – కొక్కోకము

సీ.

వనరుహానన మనోవాక్కాయకంబుల
              ధవుని దైవము గాఁగఁ దలపవలయుఁ
బ్రత్యుత్తరం బీక పని యేమి చెప్పినఁ
              జెవిఁ జేర్చి వేగంబె సేయవలయుఁ
బ్రతివాసరమును శోభనశిక్షకై నిల
              యంబు గోమయమున నలుకవలయు
నత్తమామల[1]తోడ నాప్తభృత్యులయెడ
              మాయాప్రచారంబు మానవలయు


తే.

నెపుడు ననుఁ జూచునో నాథుఁ డిచ్ఛయించి
యనుచు నిర్మలమైన దేహంబు దనర
బెనిమిటికి నిష్టమైన భోజనపదార్ధ
చయము కడుభక్తితోఁ దాన సలుపవలయు.

141

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర [4-81]

సీ.

తలఁపులో నాత్మేశు దైవంబు మాఱుగాఁ
              దరళాక్షి యనురక్తిఁ దలఁపవలయు
విభుఁడు చెప్పినమాట వేదమంత్రంబుగా
              నెలఁత నెమ్మనమున నిలుపవలయు
నధిపతి నియమించినది నిజవ్రతముగా
              జలరుహాయతనేత్ర సలుపవలయుఁ
జెలువుఁ డాదరణ నిచ్చిన పదార్థము పది
              వేలుగా నాత్మ భావింపవలయు


తే.

వలయుఁ బ్రియమునఁ బెనిమిటి వంకవారి
ప్రాణబంధులుగాఁ జూడ భామినులకు
వలవ దధిపతి పగవారివలన మైత్రి
చేయ రా దెన్నఁడు వికచరాజీవముఖికి.

142
  1. క.చోట