పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీనకాలము పిలుచు పిలుపు

75

చరిత్ర ఊరేగింపువంటిది. దానిని చూచి ఆనందించుటకు బొమ్మలును, దేశపటములును కొంత సహాయముచేయును. ప్రతిబాలునకు, బాలికకు అవి అందుబాటులో ఉండవలెను. ప్రాచీనచరిత్రకు సంబంధించిన శిథిలములను స్వయముగా చూచుట బొమ్మలను చూచుటకన్న మంచిది. వీటి నన్నింటిని చూచుట సాధ్యముకాదు. ప్రపంచమందంతటను అట్టి శిథిలములుకలవు. జాగరూకతతో పరికించుచుండిన మనకు సమీపమందే కొన్ని ప్రాచీన శిథిలములు మనము పరిశీలించుటకు లభ్యము కావచ్చును. పెద్ద పెద్ద వస్తుప్రదర్శనశాలలకో చిన్నచిన్న వస్తువులను, శిథిలములను ప్రోగుచేసి యుంచుచురు. ప్రాచీనచరిత్రకు సంబంధించిన శిథిలము లిండియాలో అధికముగాగలవు. మిక్కిలి ప్రాచీనకాలమునకు సంబంధించినవి కొద్దిగానే ఉన్నవి. ఇంతవరకు అట్టివి, మనకు తెలిసినవి మొహంజదారో, హరప్పలలో ఉన్నవి. మిక్కిలి ప్రాచీనమైన భవనము లీయుష్ణదేశములో కూలిపోయి మట్టిలోకలిసిపోయియుండును. బహుశా పెక్కులు మట్టిలో కప్పబడి నేటికిని నిలిచి యుండవచ్చును. వాటిని త్రవ్వినప్పుడు మనకు ప్రాచీనశిథిలములు, శాసనములు దృష్టి గోచరమగుసు, మన దేశ ప్రాచీనచరిత్ర మనకు క్రమక్రమముగా వెల్లడియగును. మిక్కిలి పురాతనకాలమున మన పూర్వులేమి చేసెడివారో ఈ రాళ్ళను, ఇటుకలను, సున్నమునుబట్టి మనము తెలిసికొందుము.

నీవు ఢిల్లీ చూచియుంటివి. నేటి పట్టణము చుట్టుపట్టులలో కొన్ని శిథిలములను, ప్రాతకట్టడములను చూచియుంటివి. ఈమారు వాటిని చూచినప్పుడు ప్రాచీనకాలమును తలచుకొనుము. అప్పు డవి నిన్ను ఆకాలమునకు కొంపోయి, నీకు చరిత్రను బోధించును. పుస్తకములట్లు బోధించలేవు. మహాభారత కాలమునుండియు ఢిల్లీ నగరమందును తత్పరిసరములందును జనులు నివసించుచుండిరి. వారు దానికి పెక్కు పేరులు పెట్టిరి – ఇంద్రప్రస్థము, హస్తినాపురము, తుగ్ల ఖాబాదు, షాజహానాబాదు. ఇంకా ఎన్నో పేర్లుండవచ్చు. నాకు తెలియదు. వృద్ద వ్యవహారమేమనగా - ఏడుచోట్ల ఏడు ఢిల్లీనగరము లుండెడివట. నగ