పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

ప్రపంచ చరిత్ర


భూమి గుండ్రముగాగాక బల్లపరుపుగా నుండెనని యాకాలపువారి నమ్మకము. ఆ కారణమున సమీపమందున్న చేశములను గురించి యేకాని ఇతర దేశములను గురించి ఎవరికిని ఎక్కువగా తెలియదు. గ్రీసులోని జనులు చీనా, ఇండియాను గురించి ఏమయు నెరుగరు. చీనా, ఇండియాదేశస్థులకు మధ్యధరాదేశముల సంగతి తెలియదు..

దొరికినచో పురాతన ప్రపంచపటము నొకమారు చూడుము. ప్రాచీన గ్రంథకర్తల ప్రపంచవర్ణనలును, పటములును మన కిప్పుడు నవ్వు పుట్టించును. ఆ పటములలో వేర్వేరు దేశముల స్వరూపములు అసాధారణముగా నుండును. నేడు తయారైన పురాతనకాలమునకు సంబంధించిన పటములు మనకు సహాయకారులుగా నుండును. పురాతన కాలమునుగూర్చి చదువునప్పుడు అట్టి పటముల సహాయమును నీవు తీసి కొందువని ఆసించుచున్నాను. దేశపటమువల్ల ప్రయోజన మధికముగా నుండును. అది లేనిదే చరిత్ర బోధపరుచుకొనుట కష్టము. నిజానికి చరిత్ర నేర్చుకొనుటకు పటములును, బొమ్మలును ఎన్నిఉన్న అంత మంచిది - పురాతన కట్టడముల బొమ్మలు, శిధిలముల బొమ్మలు, పురాతనకాలమునకు సంబంధించిన వస్తువుల బొమ్మలు. చరిత్ర వట్టి అస్థిపంజరమువంటిది. దానిని కప్పుటకు బొమ్మలున్నప్పుడే అది సజీవముగా మనకు కనిపించును. స్పష్టమగు మానసిక చిత్రముల పరంపరయే చరిత్ర. అట్టి మానసికచిత్రము లాకారము పొందునప్పుడే చరిత్ర పఠనమువలన మనము లాభము పొందవచ్చును. అట్టి సందర్భములలోనే చరిత్ర చదువుచున్నప్పుడు చరిత్రసంఘటనలు మన కన్నులముందర జరుగుచున్నట్లే తోచును. అది మనలను ఆకర్షించు చక్కని నాటకమయి యుండవలెను. ఒకప్పు డానాటకము సుఖాంతము కావచ్చును. తరచు అది దుఃఖాంతమై యుండును. ఈ నాటకమునకు రంగము ప్రపంచము. కడచిన కాలమునాటి గొప్ప పురుషులు, స్త్రీలు అందలి పాత్రలు.