పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

ప్రపంచ చరిత్ర


సంవత్సరములనుండి అది వాసయోగ్యముకాని గొడ్డు దేశమైనది. ఎడారితో సమానముగా నున్నది. ఆ నాటి గొప్పపట్టణములు కొన్ని నేటికి నిలిచి యున్నవి సమర్కండ్, బొఖారా అనునవి రెండు పట్టణములు. వాని పేళ్లు విన్నంతనే మనకు ప్రాతవిషయములెన్నో స్మృతిపథమునకు తగులును. కాని నేటి పట్టణములు వెనుకటి పట్టణముల ఛాయలు మాత్రమే. ,

మరల నేను రాబోవు విషయములను ముందు చెప్పుచున్నాను. మనము ప్రసంగించుకొనుచున్న కాలములో సమర్కండ్, బొఖారాలు లేవు. ఇదంతయు ముందు రాబోపు విషయము. భావికాల మను తెర దానిని మరుగు చేసినది. మధ్య ఆసియా గొప్పతనమును, పతనమును ముందుకాలపు విషయములు.


9

ప్రాతసంప్రదాయముల భారము

జనవరి 14, 1931

నేను చెరసాలలో క్రొత్త అలవాట్లను చేసికొన్నాను. అందొక్కటి అరుణోదయము కాకముందేలేచుట. కడచిన వేసగినుండియు ఈ అలవాటు చేసికొన్నాను. ఉషఃకాలమువచ్చి క్రమక్రమముగా నక్షత్రముల నార్పివేయుట చూడ నాకు సరదాగా నుండును. ఉషఃకాలమునకు ముందుండు వెన్నెల నెప్పుడైన చూచితివా? రాత్రి మెల్లగా మారి పగలగుట చూచితివా? వెన్నెలకును, ఉషఃకాలమునకును జరుగు పోరాటము నెన్ని పర్యాయములో చూచితిని. చివరకు విజయమెప్పుడును ఉషఃకాలముదే. వింతగానుండు ఆ సగము వెలుగులో అది వెన్నెలయో, లేక రానున్న పగటివెలుగో చెప్పుట కొంత సేపటివరకు కష్టము. పిమ్మట, హఠాత్తుగా సందేహము తొలగును, అది పగలే. వెలవెలబారు చంద్రుడు పోరాటమున ఓడిపోయి వెడలిపోవును.