పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాతనాగరికతలు : మన వారసత్వము

39


దేశములందును మార్పులు వచ్చినప్పటికిని, యుద్ధములు, దండయాత్రలు సంభవించినప్పటికిని ప్రాచీన నాగరీకతంతువు ఒక్క బిగినిసాగిపోయినది. ఈ రెండుదేశములును తమ యుచ్చస్థితి నుండి చాలవరకు జారినమాట వాస్తవమే. దీర్ఘ కాలము గడచుటవల్ల ప్రాచీన విజ్ఞానములపై కుప్పలుగా దుమ్మును, ఒకప్పుడు మాలిన్యమునుకూడ పడినమాట వాస్తవమే. అయినప్పటికిని అవి నిలిచియున్నవి. ప్రాచీన హిందూనాగరికత నేడుకూడ హైందవజీవితమున కాధారముగానున్నది. నేడు ప్రపంచముననూతనపరిస్థితు లేర్పడినవి. పొగయోడలు, రైళ్లు, కర్మాగారములు వచ్చుటవల్ల ప్రపంచ స్వరూపమే మారిపోయినది. ఇండియాస్వరూపమునుకూడ అవి మార్చ వచ్చునేమో, అప్పుడే మార్చుచున్నవికూడ, ఐతే చరిత్ర ఉదయించినది మొదలు మన కాలమువరకు, దీర్ఘయుగములగుండ నిరంతరాయముగ సాగినహైందవవిజ్ఞాన నాగరికతను తలచుకొన్న, ముచ్చటగానే కాదు, విస్మయజనకముగకూడ ఉండును. ఒక విధముగా చూచినఇండియాలోనున్న మనము ఆ వేలకొలది సంవత్సరములకు వారసులము. బ్రహ్మావర్త మనియు, ఆర్యావర్త మనియు, భారతవర్ష మనియు, హిందూస్థాన మనియు పేరుగడించిన సుక్షేత్రములలోనికి వాయవ్య కనుమలగుండా దిగిన ప్రాచీనులవంశవృక్షములోనివారమే బహుశామనము. కొండకనుమల గుండ దిగి ఈ క్రొత్తదేశమునకు వారు నడిచివచ్చుచుండుట నీకు కనబడుటలేదూ ? థైర్యముతో, తెగువతో ఏమి రానున్నదో యని భయపడక ముందుకు పోవుటకు వారు సాహసించిరి. మృత్యు వే తటస్థించినను వారు లెక్క చేయలేదు. చిరునగవుతో దాని నెదుర్కొనిరి. జీవితముపై వారికి ప్రీతి మెండు. భయము లేకుండుట, అపజయము విపత్తులు వచ్చినప్పుడు మనోవైకల్యమును జెందకుండుటవల్లనే జీవితసుఖముల ననుభవించవచ్చునని వారెరుగుదురు. భయరహితులవద్దకు అపజయమును, విపత్తులునురావు. ఆ మనపూర్వికులను, దూరబంధువులను ఒకమారు తలచుకొనుము. నడిచినడిచి వచ్చి, సముద్రమును చేరుటకు గంభీర