పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

ప్రపంచ చరిత్ర


ముగా ప్రవహించుచున్న గంగానదీతీరమును వారు హఠాత్తుగా చేరుట తలచుకొనుము. గంగానదీతీరదర్శనము వారికెంత ప్రమోదమునుగూర్చినదో ! గంగానదికి వారు ప్రణమిల్లిరన నాశ్చర్యమేమి ? సమృద్ధము, శ్రావ్యమునగు వారిభాషతో స్తుతించిరన నాశ్చర్యమేమి ?

ఈ యుగములకు వారసుల మనుకొనుట ఎంత గొప్పగానున్నది! గాని మనము దురహంకారము చెందరాదు. ఈ యుగములకు వారసుల మన్నప్పుడు మంచికిని వారసులమే, చెడ్డకును వారసులమే. ఇండియాలోని ఈ మన వారసత్వపు ఆస్తిలో చెడుగు చాల చేరినది. ప్రపంచములో మన మధమస్థానమున నుండుటకది కారణము, దివ్యమగు మనదేశము దారిద్ర్యములో పడిపోవుట కది కారణము. మన దేశ మితరులచేతులలో ఆటబొమ్మ యగుట కదికారణము. ఈ పరిస్థితు లిక ముందు ఎంత మాత్రము సాగకూడదని మనము నిశ్చయించుకొంటిమి కాదా?

6

హెల్లనీలు

జనవరి 16, 1931

ఈరోజున నన్ను చూచుటకు మీ రెవ్వరును రాలేదు. ములాకత్ - కాదీన్ వట్టి శుష్కదిన మైపోయినది. నాకాశభంగమైనది. సమావేశ మిప్పుడు జరుగక ఇంకొకమారు జరుగుననుట కిచ్చిన కారణము విచారకరముగా నున్నది. తాత కులాసాగాలేరని మాకు తెలిసినది. ఇక ఈరోజున సమావేశము జరుగదని తెలిసికొని నా రాటమువద్దకు వెళ్ళి కొంతసేపు వడకితిని. నేను అనుభవమువల్ల తెలిసికొనిన విషయ మేమనగా - రాటముమీద నూలువడకుట, నవారునేయుట మనస్సున కానందమును, ఊరటను కల్పించునని. కాబట్టి సంశయాత్మ వైనప్పుడు నూలువడకుము.