పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జన్మదిన లేఖ

నాయిని సెంట్రల్ చెరసాల

అక్టోబరు 26, 1930

ఇందిరా ప్రియదర్శినికి

పదమూడవ పుట్టినరోజున

నీవు పుట్టిన రోజున బహుమతులను, ఆశీస్సులను అందుకొనుట నీ కలవాటు. ఈమాఱుకూడ నీవాశీస్సులు పుష్కలముగా అందుకొనగలవు. కాని ఈ నాయిని చెరసాలనుండి నీ కెట్టి బహుమతులను నే నంపగలను? నేను పంపు బహుమతులు వస్తురూపమున నుండజాలవు. వాయురూపమునగాని. మనోరూపమునగాని. ఆత్మరూపమునగాని ఉండవచ్చును. ఏ అభిమానదేవతయైన నీ కీయగలిగిన విట్టి పారితోషికములే. వీనిని పంపుటకు చెరసాల ఎత్తుగోడలు సైత మడ్డురాజాలవు.

ఉపదేశములు చేయుట, మంచి సలహాలనిచ్చుట నా కిష్టములేని పని యని నీ వెరుగుదువుగదా, చిట్టితల్లీ , ఇట్లు చేయ నాకు బుద్ధిపుట్టినప్పుడు, నే నొకమారు చదివిన కథజ్ఞప్తికి తెచ్చుకొందును. ఆది " మిక్కిలి తెలివిగల మనుష్యుని" కథ. ఆ కథగల గ్రంథములను ముందుముందు నీవే చదువుదువేమో. పదమూడువందల సంవత్సరములకు పూర్వము, చీనాదేశమునుండి ఇండియాకు. వివేకము, జ్ఞానము నార్జించు ఉద్దేశముతో ఒక గొప్ప బాటసారి వచ్చెను. అతని పేరు యుఁవా౯ చ్వాంగ్. ఉత్తర దిక్కున నున్న కొండలను దాటి, ఎడారులను దాటి ఆతడు వచ్చెను. ఎన్నియో అపాయములనుండి అతడు తప్పించుకొనెను. ఎన్నో అంతరాయముల నాతడు గడచెను అతని జ్ఞానపిపాస యంత గొప్పది, నేడు పాట్నా యని పేర్కొనబడుచున్న పాటలీపుత్ర మను నగరమునకు సమీపమున ఆకాలమందున్న నలందా విశ్వవిద్యాలయమునం దాతడు ముఖ్యముగా తాను విద్యనభ్యసించుచు, ఇతరులకు విద్యగరిపుచు పెక్కేండ్లు