పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహితము బ్రయోగింపఁబడినదే. ఈరెండును గలసి యాలోచించినచో నీగ్రంథము శ్రీనాథుని దన్న యూహ మరింతబలము కాదా! ఆసంగతిగూర్చి విమర్శకు లేల సన్నసన్నగా నూరకుండిరి! తమవాదమునకు విరుద్ధముగా నుండువానిని విడుచుటయా విమర్శకలక్షణము! కనిసార్వభౌమబిరుద మనేకులకుఁ గలదట! శ్రీనాథునికిని గూచిమంచి తిమ్మన్నకవికిని గాక యితరుల కెవ్వని కున్నదో విమర్శకులు సెలవిచ్చిన విందము. కవిసార్వభమబిరుదమును శ్రీనాథనామమును గలిసి ప్రయోగింపఁబడుటచే మనము కూచిమంచి తిమ్మనను విడిచి శ్రీనాథునినే తీసికొనవలసివచ్చునుగదా? ప్రతికవియు నాలుగుపద్యము లల్లినతోడనే తాను కవిసార్వభౌముఁడనని పుస్తకములఁ బ్రయోగించుకొనుచుండునట? ఈవిమర్శకులు నాలుగుపద్యములు అల్లియుండిరేమో? కవిసార్వభౌముల మని పుస్తకములఁ బ్రయోగించుకొనిరా! పోనిండు. విమర్శకసార్వభౌముల మనియైనఁ జెప్పికొందురా? వారు గాకపోయిన, నట్లు ప్రయోగించుకొనినవారి పేరులు కొన్ని సెలవిచ్చెదరా! వాగనుశాసన ప్రబంధపరమేశ్వ రాంధ్రకవితాపితామహాది బిరుదములు గూడ నాలాగునే యిటీవల నుపయోగింపఁబడేనా! మరియొకటి. గ్రంథము దుర్నీతిబోధకమగుటచేతనో మరియెందుచేతనో కవి గద్య వేసికొనుట మానినందున మరి యేవిధముగాఁ గూడ దనకర్తృత్వమును దెలియజేయుట కిష్టపడి యుండడని వీరి నిర్ధారణ చేయుచున్నారు. కవి గద్య వేసుకొనుట మానెనని యెవ్వరికఁ దెలియును? ఇప్పుడు లభించిన ప్రతిని వ్రాసికొనినవారు గద్య విడిచిపెట్టియుండవచ్చును. గద్యవేసికొనలేదు పో, రసికాభిలాషము గద్య యవసర మున్నంత పెద్దగ్రంథమా? వీథినాటకమునకుఁ గవి యేగద్య వేసికొనెను. దుర్నీతిబోధక మని మానెనన్నచో, గూచిమంచి జగ్గకవి తనచంద్రరేఖావిలాపము సునీతిబోధక మనియే కాబోలు దానియందుఁ గద్య వేసికొనెను.

iii శ్రీనాథునిగ్రంథము లన్నిటినుండి తమలక్షణగ్రంథములకు లక్ష్యపద్యములఁ దీసికొనిన యప్పకవి మొదలగు లాక్షణికు లీరసికాభిలాషము పేరయినఁ దలపెట్టకుండుటకుఁ గారణ మేమని విమర్శకులు ప్రశ్న వేయుచున్నారు. వీరట పీఠికను మూలమును శ్రద్ధతో నెన్నియోసారులు చదివిరట! అవును. గ్రుడ్డిపాఠము డెబ్బదిపదునొకండుమారులు చదివినను దెలివిలేని విద్యార్థు కది యెట్లు పనికివచ్చును. "శ్రీనాథుని వీథినాటకము లోకమునఁ బ్రచురమయ్యు నీరసికాభిలాషము కానందులకు కారణము లేకపోలేదు. ఇందు గవిఁ యుద్దేసించిన నాయిక గొప్పరాజుల యింటి దనుట నిశ్చయ" మని పీఠికలో స్పష్టముగాఁ దెలుపబడియుండగా, వీరి కుశంక కింక నవకాశ మేది? అది యేల వీరు చూడరైరి! చూచినచో నేల ఖండింపరైరి! వ్రాసినది తిన్నగాఁ జూచి యర్థము చేసికొనగలశక్తి వచ్చినవెనుకనే విమర్శనముల నారంభించుట మంచిదేమో. పోనిండు. కారణము చెప్పబడలేదే యనుకొందము