Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సముచితరీతిగా గౌరవించాలని అనుకుంటున్నాము. మీరు ఏమి పారితోషికాన్ని కోరుకుంటారు కోరుకోవలసింది" అని డాక్టర్ వైజ్​మన్​ను అడిగాడు. ఇందుకు అతడిచ్చిన జవాబు ఇది.

"నాకు కావలసిన పారితోషికం మా యూదుజాతివారికి ఉపకారం చెయ్యడానికి అవకాశం మాత్రమే."

ఈ పరిస్థితిలో డాక్టర్ వైజ్​మన్​ను సంతోషపెట్టడానికి కూడా పాలస్తీనాను యూదీయుల జాతీయ కేంద్రంగా చేస్తామని మాటనివ్వవలసి వచ్చింది.

6

ఇప్పటికి పాలస్తీనా విషయమై బ్రిటన్ రెండు వాగ్దానాల్ని చేసింది. ఒకటి: ఆ దేశాన్ని అరబ్బుల స్వతంత్ర రాజ్యంగా చేస్తాననడం. రెండు: దాన్నే యూదీయుల జాతీయ కేంద్రంగా చేస్తాననడం.

ఈ రెండు వాగ్దానాలు పరస్పర విరుద్ధమైనట్టివి. పాలస్తీనా, అరబ్బుల స్వతంత్ర రాజ్యమైతే, యూదీయుల జాతీయ కేంద్రం కాలేదు. ఇక, అది యూదీయులకు జాతీయ కేంద్రమే అయితే, అరబ్బులకు అక్కడ స్వాతంత్య్రం ఉండదు. ఒక దాన్ని నిలబెట్టుకోవాలంటే, రెండోదాన్ని తప్పక తోసివెయ్యవలసిన స్థితిలో ఈ రెండు వాగ్దానాల్ని చెయ్యడమే తగని పని. కాని, బ్రిటన్ ఇంతకంటే కూడా ఘోరమైన పనిని ఇంకొకదాన్ని చేసింది. అదేమంటే- అటు అరబ్బులకూ, ఇటు యూదులకూ కాకుండా పాలస్తీనాను తానే స్వాహా చెయ్యాలను కోవడం!

టర్కీ నుంచి తాము జయించుకోబోతున్న అరేబియా రాజ్యాల్ని, వీళ్ళకూ వాళ్ళకూ కట్టబెట్టడం దేనికనుకుని కాబోలు, బ్రిటన్, ఫ్రాన్సులు తమలోతాము ఒక రహస్యపు ఒడంబడికను చేసుకున్నవి. దీన్ని "సైక్స్-పికాట్ ఒడంబడిక" అని అంటారు. ఇది జరిగింది 1916 మే నెలలో.

ఈ "సైక్స్-పికాట్ ఒడంబడిక"లోని ముఖ్యమైన షరతులు ఇవి: మెసపటోమియా రాజ్యమూ, పాలస్తీనాలోని రెండు వోడ రేవులూ (హైఫా, ఎక్రి) బ్రిటన్ అధీనంకావాలి. సిరియాకోస్తా ఫ్రాన్సు పరిపాలన కింద ఉండాలి. డమాస్కస్, అలెప్పో, మోసుల్ ప్రాంతాలు ఫ్రాన్సు (పరిపాలన కింద కాదుగాని) పలుకుబడిలో ఉండాలి. ఇక, పాలస్తీనా (పెద్ద ఓడరేవులు రెండూపోగా మిగిలిన భాగం) బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా రాజ్యాల నిర్ణయాన్ని అనుసరించి ఏర్పడే ప్రభుత్వానికి లోబడి ఉండాలి.

తెర వెనక జరిగిన ఈ కపట నాటకం (సైక్స్-పికాట్ ఒడంబడిక) సంగతి యూదీయులకు తెలిసిందో, లేదోగాని, అరబ్బులకు మాత్రం తెలియనే లేదు. బ్రిటను తన వాగ్దానాన్ని