Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దిక్కుకు (రష్యా, పోలెండు మొదలైన తూర్పు దేశాలకు) చేరుకున్నారు. కాని, కొంత కాలమైన తర్వాత ఇక్కడి నుంచి గూడా వారికి ఉద్వాసం చెప్పారు.

తమకు ఒక దేశం—ఒక జాతీయ కేంద్రం—లేకపోవడం వల్లనే అందరి తావుల్ని పడుతూ, ఎక్కడనూ నిలువ నీడలేక అల్లాడవలసిన గతి పట్టిందిగదా అని యూదు జాతివారికి సంతాపం కలిగింది. అయితే, ఎంత సంతాపంలో ఉన్నప్పటికీ ఏదో అస్పష్టమైన ఆశా రేఖ వారికి కొంత కొత్త బలాన్నీ ఉత్సాహాన్నీ ఇస్తూ ఉండేది. ఆ అస్పష్టమైన ఆశారేఖ,- పాలస్తీనా!

పాలస్తీనా తమ మాతృదేశం; తమ పుణ్యభూమి; తమ జాతీయకేంద్రం; తమ విజ్ఞాన వాటిక. ఏనాటికో ఒకనాటికి ఏదో ఒక విధంగా అది తిరిగి తమది కాకపోతుందా! తిరిగి అక్కడ తాము సుఖంగా, స్వేచ్ఛగా శాంతంగా జీవించగల భాగ్యం పట్టకపోతుందా? క్రైస్తవుల ఘోరహింసకు బలి అయిన ప్రతియూదీయుని హృదయాంతరాళంలోనూ అస్పష్టంగా ఉన్న ఈ ఆశా రేఖకు ఒక స్వరూపాన్ని కల్పించి, దాన్ని ఒక మహోద్యమంగా చేసినవాడు డాక్టర్ థియొడోర్ హెర్జల్.

డాక్టర్ హెర్జల్ ఆస్ట్రియా దేశస్థుడు. అతడి నివాసం వియన్నా. వృత్తి జర్నలిజం; నాటకాలు వ్రాయడం. అతడు చాల అందమైనవాడు; అందాన్ని మించిన ప్రతిభ గలవాడు.

"డ్రేఫస్ కేసు"ను తన పత్రికకు రిపుర్టు చెయ్యడానికి 1894లో డాక్టర్ హెర్జల్ ప్యారిస్ నగరానికి వెళ్ళాడు. ఈ కేసు చరిత్ర ప్రసిద్ధికెక్కినట్టిది. దీనిలో ముద్దాయి ఒక యూదు సైన్యాధ్యక్షుడు (జనరల్). పేరు,- డ్రేఫస్. ఫ్రెంచి సైనిక రహస్యాన్ని ఏదో విదేశ ప్రభుత్వానికి అందజేశాడని అతడి మీద కేసు వచ్చింది.

డ్రేఫస్ నిర్దోషి అని అందరికీ తెలుసు. అయితే మాత్రమేమి? అతడు యూదుజాతివాడు. ఆ జాతికి చెందడమే ఒక నేరం. ఇక ఆ జాతికి చెంది ఉండికూడా ఉన్నత సైనికోద్యోగి కావడం క్షమింపరాని పెద్ద నేరం. అంచేత అతడిని శిక్షించ వలసిందే! అతడు అనేక యుద్ధాలలో పాల్గొన్నమాట నిజం. ఎన్నో సైనిక గౌరవాల్ని పొందిన మాట నిజం. కాని, యూదు జాతివాడైనందున అతడి విషయంలో ఈ సంకోచాలు అనవసరం. తప్పక అతడిని శిక్షించవలసిందే! కఠినంగా శిక్షించ వలసిందే! డ్రేఫస్​కు కఠిన శిక్షే పడింది. ముందు దేశద్రోహాన్ని చేసినందుకు అన్ని సైన్యాల ముందు ఆ గౌరవం పొందడం. ఆ తర్వాత అజన్మ ద్వీపాంతర వాసం.

ఈ కేసులో స్వజాతీయుడైన డ్రేఫస్​కు జరిగిన ఘోరాన్యాయాన్ని కళ్లార చూచినప్పుడు "అన్య దేశాలలో ఉండి, ఆ దేశాలకు యూదీయులు ఎంత ప్రేమ పూర్వకంగా సేవ చేసినప్పటికీ, వారు ఆ దేశస్థులలో ఐక్యమైపోలేరు. వారు ఐక్యమైపోవాలని అనుకున్నా ఆ దేశాలవారు అలా జరగనివ్వరు." అని హెర్జల్ నిశ్చయించుకున్నాడు. అయితే, మరి యూదీయుల గతి ఏమిటి? ఆ క్షణంలో అతడి మనోవీధిని ఒక మెరుపు మెరిసింది- పాలస్తీనా!