Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక వ్యవహారాలు, వలస సమస్య, భూముల క్రయవిక్రయాలు మొదలైన ముఖ్య విషయాల్ని గురించి ముందుగా తీర్మానించగల అధికారం కౌన్సిల్​దే గాని, అసెంబ్లీది కాదు.

ఆరబ్బులకు, యూదులకు ఏకాభిప్రాయం కుదరక, ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు వీటో చెయ్యగల అధికారం హైకమీషనర్​కు ఉండడం.

యూదులు, ఆరబ్బులు ప్రస్తుత వైషమ్యాలను చంపుకుని, ఒకరితో ఒకరు సహకారం చెయ్యడం ప్రారంభించగానే హైకమీషనర్ వీటో అధికారం రద్దు కావడం.

స్వపరిపాలనకూ, స్వాతంత్య్రానికీ అవకాశ మివ్వని ఈ ఏర్పాట్లకు ఆరబ్బు ప్రతినిధులు అంగీకరించడం లేదు. ఇందుక బదులుగా పాలస్తీనాకు యూదీయుల వలస పూర్తిగా ఆగిపోవాలనీ, ఇకముందు ఆరబ్బుల భూముల్ని యూదీయులు క్రయం చేయించుకోడానికి వీలుండరాదనీ వారు కోరుతున్నారు. ప్రజలందరు చేరి ఒక కాన్సిట్యుయెంట్ అసెంబ్లీని ఎన్నుకోవాలని, ఈ అసెంబ్లీ సభ్యులు తమలో కొందరిని మంత్రులుగా నియమించాలనీ, ఈ మంత్రులకు వెంటనే దేశ పరిపాలనాధికారాన్ని ఇచ్చి వెయ్యాలనీ, ఇప్పుడు వివిధ శాఖలకు అధికారులుగా ఉన్నవారు ఈ కొత్త మంత్రులకు వెంటనే దేశ పరిపాలనాధికారాన్ని ఇచ్చి వెయ్యాలనీ, ఇప్పుడు వివిధ శాఖాలకు అధికారులుగా ఉన్నవారు ఈ కొత్త మంత్రులకు లోబడి ఉండాలనీ వారు (ఆరబ్బు ప్రతినిధులు) పట్టుపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న కాన్సిట్యుయెంట్ అసెంబ్లీయే పాలస్తీనాకు భావి రాజ్యాంగ విధానాన్ని నిర్ణయించాలనీ, ఈ విధానాన్ని ఎట్టి మార్పులు లేకుండా బ్రిటీష్ పార్లమెంట్ ఆమోదించాలనీ కూడా వారి వాదం. ఈ షరతులకు అంగీకరించని పక్షంలో ఇంకొక సమావేశాన్ని జరపడం వృధా శ్రమ అని వారు ఖచ్చితంగా చెబుతున్నారు.

ఇక, యూదు ప్రతినిధులకు ఆరబ్బుల షరతులు ఎంత కంటకంగా ఉన్నవో బ్రిటన్ సూచనలు కూడా అంత అనంగీకారంగా ఉన్నాయి. వారు పై ఉభయులకూ భిన్నంగా వెళ్ళి, తమ షరతుల్ని తాము పెడుతున్నారు. బ్రిటన్ పాలస్తీనాపై తన మేండేటరీ అధికారాన్ని వదులుకోరాదనీ, ఆ దేశాన్ని రెండుగా చీలదీసి, ఒక రాజ్యాన్ని ఆరబ్బు రాజ్యంగానూ, ఇంకొక దాన్ని యూదు రాజ్యంగానూ చేసి, రెండింటినీ కూడా అక్కడి ప్రజల సహకారంతో పరిపాలిస్తూ, చివరికి ఒక నాటికి రెండు భాగాలలోనూ సమానమైన జనాభా ఉండేటట్టుగా చెయ్యవలసిందిగా వారు కోరుతున్నారు.

ఈ ధోరణిలో నడుస్తున్నది లండన్​లో జరుగుతున్న పాలస్తీనా సమావేశం. రాజీ కుదరలేదనీ, మరి లాభం లేదనీ, సమావేశం చాలింపబడిందనీ, రేపోమాపో వార్త వస్తే మనం కించిత్తు అయినా ఆశ్చర్యపడ నవసరం లేదు.

పాలస్తీనా సమస్య ఎన్నటికైనా పరిష్కారమైతే, పాలస్తీనాలోనే కావాలి గాని లండన్​లో కాదు.