Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఆరబ్బులకు అంగబలం ఉంటే, యూదులకు అర్ధబలం ఉంది. అంచేత వారు తేలికగా అక్కడ కాలూనగలరు. ఇందుకు తోడు వారి భాష ఆరబిక్; వీరిది హీబ్రూ. వారి మతం ఇస్లాం; వీరిది జూడాయిజం. వారి ఆచార వ్యవహారాలు ప్రాచ్య ఖండానివి; వీరివి పాశ్చాత్య ఖండానివి, అంచేత వీరుభయులూ ఏకం కావడంగాని బ్రిటన్ మీద ఎదురు తిరగడం గాని కల్ల. మహమ్మదీయ ప్రపంచం మధ్య ఏకాకులమై ఉన్నామనే భయం కొద్దీ యూదీయులు శాశ్వతంగా బ్రిటన్ ప్రాపకం కోసం దేవులాడ వలసిందే!

విభిన్నమైన దృక్పథాలు, విరుద్ధమైన ఆశయాలు కలిగివున్న రెండు జాతుల వారు ఒకే దేశంలో ఉన్నప్పుడు వారిలో వారికి కలహాలు తప్పవు. ఈ అంతఃకలహాల గొడవలో దేశానికి స్వాతంత్య్రం కావాలనే ఆందోళన తప్పుతుంది. పైగా యూదులూ, ఆరబ్బులూ అనవతరం సంఘర్షిస్తూ ఉంటే వారుభయుల మధ్య తగవు తీర్చడానికి మూడవ పక్షం ఉండాలనే సాకుతో బ్రిటన్ శాశ్వతంగా దేశ పరిపాలాధికారాన్ని తన చేతిలోనే పెట్టుకోవచ్చును.

వైమానికాశ్రయాల పరిసర ప్రాంతంలో ఎప్పుడూ స్నేహపాత్రంగా ఉండే ప్రజలుండడం అవసరం. ఆరబ్బులు— ఇంతకుముందు వివరించినట్టు —ఎల్లకాలం స్నేహంగా ఉంటారని ఆశించడానికి వీలులేదు. అంచేత పాలస్తీనాలో యూదు జాతీ కేంద్రాలు ఏర్పడితే, వాటి మధ్య బ్రిటన్ నిస్సంకోచంగా తన వైమానికాశ్రయాల్ని నిర్మించుకోవచ్చును.

యూదుల పెట్టుబడి ద్వారా పాలస్తీనా వ్యావసాయికంగానూ, పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందడానికి వీలులేదు. అప్పుడక్కడ బ్రిటీష్ వ్యాపారానికి ఎక్కువ సదుపాయం ఉంటుంది.

ఇలాంటి అనేక కారణాల వల్లనే బ్రిటన్ యూదీయుల పట్ల పక్షపాతాన్ని చూపిందిగాని, వారిపై ప్రత్యేక ప్రేమతో కాదు. ఈ విషయాన్ని కెనడా గవర్నర్ జనరల్ టీడ్స్​మూర్ స్పష్టంగా అంగీకరించాడు. అతడి పలుకులివి:

"ప్రాచ్య, పాశ్చాత్య ఖండాల మధ్య వున్న రాజమార్గ రక్షణకు పాలస్తీనా పెట్టనికోట వంటిది. అబిసీనియా యుద్ధం తర్వాత ఈ రాజమార్గ రక్షణ విషయమై మనం కొంత ఆందోళన చెందవలసి వచ్చింది... ఈ దృష్టితో చూస్తే, జియోనిజం వల్ల (పాలస్తీనాను యూదు జాతీయ కేంద్రంగా చెయ్యడం వల్ల) గ్రేట్ బ్రిటన్​కు ప్రస్తుత సమయంలో ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోవచ్చును".

నిరాశ్రయులై అల్లాడుతూ ఉన్న ఒక గొప్ప జాతి ప్రజలకు జాతీయ కేంద్రాన్ని ఏర్పరచాలనే మహదాశయంతో ప్రారంభమైన జేయోనిజం చివరికి బ్రిటీష్ ఇంపీరియలిజం నీచ స్వార్ధ సముపార్జనకు సాధనమైంది. అంచేతనే దాన్ని చూచి అసహ్యించుకోవలసి వస్తున్నది.

12

బ్రిటన్ పక్షపాతాన్ని అవకాశంగా చూచుకుని యూదీయులు అరబ్బులకు చేసిన— చేస్తున్న —అన్యాయాలు ఇన్నన్ని కావు.