Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పుడు ఆరబ్బులకు బ్రిటన్ వాగ్దానాల మీదనూ, ధర్మబుద్ధి మీదనూ పోయిన విశ్వాసం తిరిగి ఎన్నడూ ఏర్పడలేదు; ఇక ఏర్పడదు కూడా!

7

బ్రిటన్ చేసిన వాగ్దానాల్ని చెల్లించకపోవడం ఒక పాలస్తీనాలోనే కాదు, ఇండియాలో, ఈజిప్టులో, ఇంకా ఎన్నో ఇతరచోట్ల అది ఈలాగే చేసింది. అయితే, పాలస్తీనాలో చేసినంత ఘోరంగా అది ఈ పనిని ఇతర చోట్ల చెయ్యలేదేమో!

పాలస్తీనాను ఆరబ్బు స్వతంత్ర రాజ్యంగా చేస్తానని ముందు మాట ఇచ్చి, ఆ తర్వాత దాన్ని తానే వశపరచుకోవడానికి బ్రిటన్ ఒక సాకు చెబుతుంది. అది ఏమంటే,- సర్ హెన్రీ మాక్-మాహోన్​కు హుస్సేన్ సూచించిన ఆరబ్బు స్వతంత్ర రాజ్యం సరిహద్దులలో పాలస్తీనా లేదట. ఇది కేవలం అబద్ధమనే చెప్పాలి. అరేబియా అంతటిలో సారవంతమైన ప్రదేశాలలో ఒకటైన పాలస్తీనాను—తూర్పు మెడిటరేనియన్​కు ఆయువుపట్టులలో ఒకటని చెప్పదగిన హైఫా ఓడరేవు ఉన్న పాలస్తీనాను—మూడు ఖండాల రహదార్లకు జంక్షన్​గా ఉండి, అరేబియా అంతటికీ ప్రాముఖ్యతను తెచ్చే పాలస్తీనాను—హుస్సేన్ తాను సూచించిన సరిహద్దులలో చేర్చలేదనడం నమ్మదగిన విషయం కాదు.

ఒకవేళ ఈ వాదాన్ని కొట్టివేసినా, ఇంతకంటే బలీయమైన ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. ఆరబ్బుల్ని విప్లవం చెయ్యవలసిందిగా ప్రబోధిస్తూ బ్రిటీష్ విమానాలు లక్షలాది కరపత్రాల్ని వెదజల్లాయి. ఈ కరపత్రాలలో అరేబియాను స్వతంత్ర రాజ్యానికి వారు స్వయంగా పేర్కొన్న సరిహద్దులలో పాలస్తీనా ఇమిడిఉంది.

అంచేత, పాలస్తీనా విషయంలో బ్రిటన్ ఆరబ్బుల పట్ల నమ్మకద్రోహం చేసినదనడంలో ఏమీ సందేహం అవసరం లేదు. ఈ విషయాన్ని ఒక బ్రిటీష్ ప్రముఖుడే కింది విధంగా అంగీకరించాడు:

"ఈ ప్రాంతంలో మన మార్గం ఉల్లంఘించిన వాగ్దానంతో నిండివుంది... 1915లో మనం పాలస్తీనాను హెడజాజ్ రాజైన హుస్సేన్​కు ఇస్తామన్నాము; 1916లో సైక్స్-పికాట్ ఒడంబడిక కింద దాన్నిమనమే అట్టెపెట్టుకోవాలనుకున్నాము; 1917లో బాల్ఫర్ ప్రకటన ద్వారా యూదులకు వాగ్దానం చేశాము; 1918లో తిరిగి హుస్సేన్ రాజుకు ఆశపెట్టాము; యుద్ధ విరామం జరిగిన రోజులలో స్థానిక ప్రజలకు పట్టం కడతామన్నాము; సంధి సభ (ప్రెస్ కాన్ఫరెన్స్) జరిగిన తర్వాత యూదీయుల వైపు మొగ్గాము".

పాలస్తీనా విషయంలో బ్రిటన్ ఇంత దగాకోరుగా నడచుకోడానికి—ఇంతకు ముందు సందర్భానుసారంగా అక్కడక్కడ సూచించినట్టు—అనేక బలీయమైన కారణాలున్నాయి. అవి ఏమంటే,