పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

పాంచాలీపరిణయము


డర్ధరాజ్య మిచ్చి యభిషిక్తుఁ గావించె, సకలబంధుసంఘసమ్మతముగ.


క.

అభిషిక్తుఁ జేసి యిభపుర, విభుఁ డింద్రప్రస్థమనెడువీ డిచ్చినఁ బాం
డుభవుండు భీమసేన, ప్రభృతులతో భూమియేలెఁ బ్రాభవలీలన్.


సీ.

గంటెడునేలైనఁ బంటకబ్బనిచేను పింపిళ్ళు గూయని గుంపుపైరు
సేన పాతర కొల్చు లేనిహాళికమౌళి బానెడుపాలీని పాడియావు
పొడిచితే నెక్కడఁ బ్రొద్దాయెనని పెద్దజేజేయిడని ద్విజరాజరాజి
వింతకుబేరుఁడై విఱ్ఱవీఁగని బేరి పుట్టుభోగులుగాని భూభుజులును
బన్నిదమునకుఁగాన మెప్పట్టునందు, ధరణితరుణి శిరోమణి దారకరణి
తరణిశరణి భవద్ధామ ధర్మరాట్ప్ర, సన్నభుజపీఠిఁ గాపురంబున్నకతన.


ఉ.

తమ్ముడు దోర్బలాఢ్యుఁడఁట తమ్మునితమ్ముఁడు గార్ముకంబుచే
నిమ్మహి వార్త కెక్కెనఁట యిద్దఱు తక్కినతమ్ము లాజిలో
దుమ్ములు రేఁచుశూరులఁట దుర్మదవైరుల ధర్మకర్మఠుం
డమ్మరొ ధర్మరాజుఁ గొనియాడఁగఁ జెల్లదె యెల్లదేశముల్.


క.

ఆపదలు గదలు రాజ్యము, చేపడు జయమబ్బు సిరులు చేరున్ బహుక
న్యాపాణిగ్రహ మలవడు, నీపాంచాలీపరిణయ మించుక విన్నన్.


క.

అని వైశంపాయనముని, వినిపించిన విని వినీతవిమలాత్మకుఁ డా
జనమేజయ జగతీవిభుఁ, డనురాగసుధాళి నోలలాడుచునుండెన్.


మ.

భ్రుకుటీమాత్రకుటీవిలంఘనగళద్భూదేవతాదీనతా
ముకుటీరాజతటీపటిష్ఠరుచినిర్ముక్తాపరాశాతనూ
ప్రకటీభూతకటీరహాటకపటీపర్యంకహస్తాంబుజా
సుకటీరత్నఘటీ కుచామణితటిక్షుణ్ణాలయప్రాంగణా.


క.

శితకరపుష్కరిణీవిక, సితసరసీరుహమరందసేవాహావా
గతచరితదురితవిరహిత, హితమారుతశీతసురభిమృదుపర్యంకా.


మాలిని.

దితిసుతనుతకోటీ దేవపూజార్హపేటీ, కృతనటనవధూటీ కీర్తితాగా
శతమఖముఖజూటీ సంచరశ్సాదధాటీ, హతనతదురితాటీకాతి కార్పణ్య


గద్య.

ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత
సరససారస్వతలహరీపరిపాక కాకమాని ప్రబోధబుధకవిసార్వభౌమపౌత్ర రామ
లింగభట్టపుత్ర కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీతంబైన పాంచాలీ
పరిణయంబను మహాప్రబంధంబునందుఁ సర్వంబును బంచమాశ్వాసము