పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

పాంచాలీపరిణయము


క.

కన్నె కొనగోరఁ జీరిచి, సున్నంబిడి మడిచి యిచ్చు చుట్టులవీడం
బిన్నిదినంబులకన్నన్, గొన్నిచవుల్ హెచ్చుచూపెఁ గువలయపతికిన్.


క.

చక్కెర యొకపరి నొకతరి, నుక్కెర యొకసారి తేనె యొకమా టమృతం
బక్కీరవాణి వాతెఱ, నొక్కినతఱిఁ జిక్కెఁ బతికి నూఱేసిరుచుల్.


ఉ.

సం దొకయింత యీని బిగిసందిట గ్రుచ్చి ప్రవీణపాణిచే
నంది ముఖాముఖిన్ సఖిసుధాధరముం గబళించి పీల్చి తే
నెం దగఁగ్రోలి కెంపునిచి నిద్దపుగంటి రచించి చీ
ల్చెం దుది నజ్జునజ్జుగను జేసి నిజేశుఁ డవార్యవాంఛికన్.


ఉ.

వాచవి చూచిచూచి సతివాతెఱ చన్గవ పట్టిపట్టియున్
మాచతురత్వ మింక వెడమాటగుఁ గాక యనంగఁబోక కా
లోచితకార్య మెంచక నవోఢగదాయనఁగూడ కెంతయున్
వాచిన వానిరీతి రతి నాఁడు హళాహళి చేసె వాసిగన్.


చ.

గళరవభేదముల్ గఱపి కౌఁగిటిపట్ల బిగింబెనంగుటల్
దెలిపి సుసీత్కృతి ప్రకృతిదిద్ది కళీపెళులింత నేర్పి ని
స్తులనఖరద్విజక్షతము సొంపెఱిఁగించి యపారపున్ రతుల్
పలుమరు శిక్ష చెప్పి పతి ప్రౌఢను జేసె నవోఢ నంగనన్.


చ.

అలయిక యింత లేక పతినండి పెనంగెడుచోట జెట్టియై
బెళుకు దలిర్పఁగా నధరబింబము చించెడు బోటఁజిల్కయై
గళరవభేదముల్ దెలుపు గట్టితనంబునం బావురంబునై
కళలఁ గలంపనేర్చెఁ గలకంఠి రతిప్రకృతిప్రవీణయై.


ఉ.

కమ్మనియూర్పుగాడ్పు చలకమ్రకుచమ్ముల పూతయూతఁగా
నెమ్మెయి మర్మముల్ పొలుప నిద్దపుఁజెక్కుల తేటనవ్వులం
సమ్మునజాఱిజాఱు వగసందెడు క్రొవ్వెద క్రొవ్విరుల్ సహా
యమ్ముగ సేదదేర్పఁ బతి హా యనియెన్ సతి సల్పఁగా రతిన్.


గీ.

నటదురోజుంబు నిటలసంఘటితకచము, పర్యటద్దళ్లతాటంకపాటవంబు
కటితటీసమ్రటత్కాంచికాకలాప, ముపరిరత మిచ్చుఁగా సౌఖ్య మపరిమితము.


ఉ.

చొక్కి ప్రసూనశయ్య రతిసోలియుఁ జాలుఁజుమీ యనంగఁబోఁ
డిక్కమలాక్షి నిట్టె రమియించెదనంచుఁ దలంచు నాథుఁ డా
జక్కవగుబ్బలాడి యరజాఱిన కొప్పు పిసాళిచూపులుం
జక్కెరమోవితోఁ గళలు చల్లెడు మో మెటువంటిదోగదా.