పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

పాంచాలీపరిణయము


క.

నీలశిశుపాల మద్రనృ, పాల జరాసంధలోక బంధుతనూజుల్
చాలించి వెనుకఁ దిగిచిన, వేళన్ దివిజేంద్రసుతుఁడు ద్విజసభ వెడలెన్.


క.

వెడలి కడుఁబుడమినల్గడ, గడగడఁ గంపింపఁ గదలి కదళీకాండం
బొడియు కరివోలె వలగా, నడిచి నతుల్ చేసి ధనువునకు చేసాచెన్.


ఉ.

అక్కట దిక్కుటీరనట దాహవతేజులు రాజు లెల్ల ని
ల్లెక్కిడ లేకయుండ ద్విజుఁ డెక్కడ కార్ముక కర్మ మెక్క డ
మ్మక్క యితండు విప్రకుల మాఱడి బెట్టె నటంచుఁ గొందఱే
యుక్కును లేక యిట్టిపని కొగ్గునెయం చొకకొంద ఱాడఁగన్.


శా.

పూర్వాభ్యస్తశరాసముంబలె గరాంభోజంబునం బట్టి వి
ల్మౌర్వీధూర్వహనంబు గాఁగ నవలీల న్వంచి పంచాస్త్రత
ద్గీర్వాణాస్త్రశరవ్య మవ్యయగతిం ద్రెళ్ళంగ నేసెన్ సురల్
శర్వాణీశుఁడే యీతఁడంచు సుమవర్షంబుల్ ప్రవర్షింపఁగన్.


శా.

వీనింగన్నది తల్లి గాక నరుఁ డుర్వింబుట్టినం జాప వి
ద్యానైపుణ్యము లిట్టులుండవలదా యౌరా భుజాగర్వ మా
హా నిశ్శంకధృతిన్ సతేజుఁడు ద్విజుం డాభూభుజుడంచు న
చ్చానం గాంచు వియచ్చరోచ్చయము మెచ్చంజొచ్చె వివ్వచ్చునిన్.


ఉ.

ఎంతటివన్నె దెచ్చే గుఱియేసి యితండు ద్విజన్మజాతికిన్
వింతయుటంచు రాజులగణింపక తిట్టుచు గేలి గొట్టుచున్
గంతులు వైచుచుం దలకుఁగట్టిన చెంగెగవైచి పట్టుచున్
గొంతులు రాయఁ గోయనుచుఁ గూఁతలు వెట్టిరి గ్రామ్యభూసురుల్.


క.

మనలో మన మిటు పొరిచూ, పున నుండిన నుంటి మేకముగ నుండినఁ గుం
భిని యేలమె యని భృగురా, మునిఁ దిట్టిరి శ్రోత్రియోత్తములు ముంగోపుల్.


ఉ.

ఆసమయంబునం దజహయాసమయాన యొయారిరంగ సం
వాస వసత్ప్రసన్నముఖు వాసవసంభవు సాయకాసనా
భ్యాస నవప్రభావ వృషభాసన శాసనవాసనాభరున్
బ్రాసవదామకంబు మెడపై సవరించి వరించెఁ బూజలన్.


శా.

పాంచాలాత్మజ పాండునందను వరింపం గాంచి మమ్మెల్ల రాఁ
బంచెం బంచినవాఁడు చుట్టముబలెం బట్టిన్ సమర్పింపక
భ్రాంచచ్చంచలలక్ష్య మేయుమని మాయల్ పన్ని కన్నెం బ్రసా
దించె న్విప్రునికంచు నా ద్రుపదుపై దిగ్రాజు లత్యుగ్రులై.