పుట:పల్నాటి చరిత్ర.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

పల్నాటి చరిత్ర

పింగళి సూరనగాని రామరాజ భూషణుడుగాని, కృష్ణ దేవరాయల కేగ్రంధమును అంకితము చేయని కారణముచేత రాయల యాస్తానములో వీరు లేరనియు, తరువాత నుండిరనియు కొందఱి వాదము, అష్టదిగ్గజకవులలో వీరి పేర్లుకూడ నుండుట చేతను, నారీతిగా ననేక చాటుపద్యము లుండుటచేతను కృష్ణదేవరాయల చివరిసంవత్సరములలో వీరిద్దఱు చేరిరనియు, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణాదులు పెద్దవారలుగా నుండినప్పుడు పిన్నలుగా వీరిద్దరు రాయలవద్ద కవులలో నుండిరనియు, రాయలయనంతరము వీరిద్దరు గ్రంధముల రచించి రాయల తరువాతి రాజుల కంకితము చేసిరనియు కొందరివాదము. ఇతడు రాఘవ పాండవీయమును ఆరువీటి పెద వేంకటపతి భూపాలునకును, కళాపూర్ణోదయమును నంద్యాల కృష్ణభూపతికిని నిచ్చెను. తాను గోకనమంత్రి వంశజుడననియు పింగళి యను గ్రామమున దన పూర్వులు చిరకాలముండుటచే పింగళి యను పేరువచ్చినదనియు, ప్రభావతీ ప్రద్యుమ్నములోని

మ. తరముల్ నాల్గయి దెందునెందు దగుదత్తద్గ్రామ నామంబులం
     బరగున్ వంశములెల్ల పూర్వపునిజప్రఖ్యాతి మాయంగ నే
     మరుదో పింగళినామముందు చిరకాలావాసులైయున్న సు
     స్థిరతన్ గోకనమంత్రివంశజులకుం జెన్నొందుమిన్నందుచున్

అనియు, సూర్యునివరముచే నతని సంతతి శాఖోపశాఖ లై యన్ని ప్రాంతములందు ప్రబలినదనియు, వ్రాసినాడు. పింగళి సూరన గ్రామము పల్నాటిలోని పిన్నెలి. ఇందులకాధార ముళ, పింగళియను గ్రామమాంధ్రదేశమున యెచ్చటను లేదు.