పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

పద్మపురాణము


చ.

మెర మెర యేల నీకు! హరిమిత్రసుతుండు సుమిత్రుఁ డుత్తమ
స్థిరమతిఁ బొల్చు నొక్కరుఁడు చెచ్చెర నాతని మైత్రిఁగూడి భా
సురమగు వేడ్కతో యమునఁ జొచ్చి నయంబున మాఘమాససం
కరదివసద్వయంబు నవగాహనము సేసితి తజ్జలంబులన్.

58


వ.

తత్ప్రభావంబునం జేసి యొక్కస్నానఫలంబున నీపాపంబు
వొలిసె, మఱియు నొక్కట [1]దేవలోకసౌఖ్యంబు సంభవించెఁ;
గావున నీవు తత్సుఖం బనుభవింపుము. నీ యన్న యత్యంత
పాతకుండు గావున నసివత్రభేదము[2]రాఘాతశిలాప్రహరణాది
మహానరకదుఃఖంబులం బెద్దకాలం బనుభవింపఁ గలవాఁడని
చెప్పిన యమదూతవచనంబులు విని దుఃఖహర్షంబులు మనం
బునం బెనంగొని వికుండలుం డిట్లనియె.

59


అ.

అడుగు లేడుగూడ నడచినయంతన
సఖునిగాఁ దలంచి సౌమ్యలీల
నార్యులైన వార లాప్తుఁనిగాఁ జూతు
రీవు నాకు సఖుఁడ వే విధమున.

60


క.

కావున సర్వజ్ఞుఁడ వగు
నీవలన వినంగ [3]వలతు నిరయములం దా
రే వెఱఁగు కర్మవశమున
భావింపఁగ నెట్లు దుఃఖపడుదురు చెపుమా.

61


వ.

అనిన నతండు పాపరహితుండవైతివి కావున నీ చిత్తంబున ధర్మ
రుచి జనియించి యడిగెదు నీ యడిగిన యర్థంబెల్ల సవిస్తరం
బుగాఁ జెప్పెద దత్తావధానుండవై వినుమని యిట్లనియె.

62
  1. దేవసౌఖ్యంబు (ము)
  2. మురరా (తి-హై)
  3. వలయు (ము)