పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

పద్మపురాణము


క.

క్రతువులు నుపకారంబులు
వ్రతములు నుపవాసములును వసుధావర స
న్నుతమాఘస్నానమునకు
సతతము సరిగావు [1]తలఁప సౌజన్యనిధీ!

33


వ.

ఈ యర్థంబున [2]కొక్కయితిహాసంబు గల దాకర్ణింపు మని యి
ట్లనియె.

34

హేమకుండలచరితము :

సీ.

కృతయుగంబునఁ దొల్లి యతిశయసంపదఁ
       బొలుపగు నైషధపురమునందు
హేమకుండలుఁ డన నేపారు వైశ్యుండు
       ధనదసమానుండు దానరతుఁడు
కులజుండు సత్కర్మకుశలుండు దేవభూ
       సురవహ్నిపూజనా[3]పరిణతుండు
దానదయాచారధర్మసత్యంబులు
       మొదలైన గుణములఁ బొదలుచుండు


తే.

నవనిఁ గ్రయవిక్రయాదులయనువు లెఱుఁగుఁ
గృషియు గోరక్షణాది సత్క్రియలు నేర్చు
నధికసంపదలందును నధికుఁ డగుచు
ధర్మచరితుండు నానొప్పు ధరణిమీఁద.

35


వ.

మఱియుఁ దృణకాష్ఠఫలమూలలవణైలాలవంగమలయజాగరు
కుంకుమాదులను, వస్త్రధాన్యతైలాదులను, ధాతులోహాదులను,
గోమహిషకుంజరాశ్చమేషాదులను సంగ్రహించి తత్క్రయ
విక్రయలాభంబు లాదిగాఁగల బహువిధోపాయంబుల నెనిమిది
కోట్లసువర్ణంబు సంపాదించి యున్నంత.

36
  1. నిత్య (మ)
  2. నొక్క (ము)
  3. పరిచితుండు (ము)