పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

43


క.

వడఁగలపాటుల నెల్లను
బడిపడి పడలేక విసివి పద్మాసన! నీ
యడుగులు గొలువగ వచ్చితి
మెడసేయక మద్విరోధి నే వడఁపు వెసన్.

6


ఆ.

అనినఁ బద్మగర్భుఁ డాలించి సుందోప
సుందవధకు నొండుమందులేమిఁ
దెలియఁ జూచి వారు తెగువతో నన్యోన్య
హతుల మృతులు గాఁగ ననువుఁ దలఁచి.

7


వ.

ఇంద్రాదులం జూచి మీరలు మీనిజస్థానంబులకుం జని సుఖం
బుండుఁ డని వారల వీడ్కొల్పి మాఘస్నానఫలంబున విష్ణులోక
సుఖం బనుభవించుచున్న వృక్షకాంగనం దలంచిన నదియుఁ ద
త్క్షణంబ.

8


సీ.

చిగురుటాకులమీఁది జిగి బాగుగాఁ గూర్చి
      యడుగుఁ దమ్ములు గాఁగ నలవరించి
కొమరారు ననఁటికంబములసోయగమెల్లఁ
      దెచ్చి యూరులు గాఁగ నచృపఱచి
పసిఁడి కుంభంబుల [1]మిసిమియంతయుఁ గూర్చి
      యొగిఁ జన్నుఁగవ గాఁగ నోజపఱచి
యలికులంబులమీఁది హరినీలరుచి నూడ్చి
      కరమొప్ప నెఱివేణిగా నమర్చి


తే.

కడఁగి బయ లావటించి నెన్నడుముఁ జేసి
కలువఱేకులఁ గన్నులుగా [2]నొనర్చి
పంచశరుఁ డేర్చి చేసిన ప్రతిమ యనఁగ
నువిద సనుదెంచెఁ గమలసంభవుని కడకు.

9
  1. పసిమియు గమకంబు (హై-మ), పసిమియు గపురంబు (తి)
  2. నమర్చి (ము)