పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

పద్మపురాణము


క.

సరసిజభవ భవ విష్ణులు
పరువడిఁ దన బింబముననె ప్రతిభాసితులై
తిరిగెడు త్రిభువనదీపకుఁ
బరమాత్మునిఁగా భజింతుఁ బంకరుహాప్తున్.

6


క.

కాకుత్స్థాన్వయజలనిధి
రాకామృతధాముఁడైన రాముచరిత్రం
బాకల్పోన్నతిఁ జెప్పిన
యాకవితాగురుని మునిగణాగ్రణిఁ గొలుతున్.

7


చ.

అతులమనీషఁ బేర్చి నిగమావలి చిక్కులు దీర్చి సూత్రమున్
ధృతి నొనరించి పెంపెసఁగు దివ్యపురాణము లెల్లఁ జెప్పి భా
రత మనుపేర వేదము దిరంబుగఁ జేసిన విష్ణుమూర్తి సు
వ్రతు మహనీయబోధనుఁ బరాశరసూనుఁ [1]దలంచి మ్రొక్కెదన్.

8


ఉ.

భారత వేదవాక్యరసభావము లజ్ఞు లెఱుంగలేక ని
స్సారమనస్కులై తిరుగు చందముఁ జూచి తెనుంగుబాసఁ బెం
పార రచించి యందఱఁ గృతార్థులఁ జేసిన పుణ్యమూర్తులన్
సారమతి న్భజింతు ననిశంబును నన్నయ తిక్కనార్యులన్.

9


సీ.

హరిసేవనామృతాహ్లాదుఁ బ్రహ్లాదుని
       సన్నుతచారిత్రు శక్తిపుత్రు
సంగీతవిద్యావిశారదు నారదుఁ
       బుణ్యతమశ్లోకుఁ బుండరీకు
భారతసంహితాభ్యాసు వేదవ్యాసు
       నతులపావనవేషు నంబరీషు
నవిరళజ్ఞానవిద్యాసముత్సుకు శుకుఁ
       గృష్ణాఘకర్దమగ్రీష్ము భీష్ము

  1. గుఱించి (తి)