పుట:పంచతంత్రి (భానుకవి).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని వివర్ణవదనుండై నిట్టూర్పులు నిగిడించుచు వెండియు
నిట్లనియె.

14


క.

తనపూర్వజన్మకర్మము
లనుదినము శుభాశుభమ్ము నందించు, జగ
జ్జను లాదిజీవులగు దై
వనియోగమువలనఁ గడవవచ్చునె తలఁపన్!

15


గీ.

సుజనులకు లేమి, గ్రహపీడ సోమసూర్యు
లకు, భుజంగేంద్ర, మాతంగశకున, సంచ
యమున, కరయంగ బంధన మాచరించు
నలఘుతరమైన, విధిశక్తిఁ దెలియ వశమె!

16


శా.

తారామార్గమునం జరించు ఖగసంతానమ్ము వారాశిలో
నారూఢస్థితినున్న మీనతతి దైవాధీనతన్ భూజనో
గ్రారంభంబున గాదె! చిక్కుపడుఁ, గాలాతిక్రమక్రీడ, నె
వ్వారల్ నేర్తు రుపాయధైర్యబలగర్వఖ్యాతిఁ బెంపొందినన్.

17


వ.

అని యివ్విధంబున హిరణ్యకుడు హృదయతాపనివారకంబు
లఁగు వాక్యమ్ములు పలికి యాచిత్రగ్రీవపాశవిచ్ఛేదనారంభుండై నిలిచిన నతం
డిట్లనియె.

18


క.

ఓయన్న! యీవిహంగని
కాయమునకు మున్నె చనఁగఁ గౌతుకమగునే!
యీయనఘులబంధమ్ములు
పాయమ్మునఁ బాయఁజేయు పరమప్రీతిన్.

19


గీ.

అనిన మూషికపతి విహంగాగ్రగణ్యు
జూఁచి కీర్తింపఁదగు నీవిశుద్ధచరిత
మనుచు బంధనవిచ్ఛేద మొనరఁజేసి
యతిథిపూజల నన్నింటి నాదరించె.

20


వ.

వెండియు నుపగూహనం బాచరించి పతత్రిసమేతుండగు చిత్ర
గ్రీవు వీడ్కొని నిజగృహంబునకుం జని సుఖంబుననున్న సమయమ్మున,