పుట:పంచతంత్రి (భానుకవి).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని చెప్పిన దమనకువాక్యమ్ము లాకర్ణించి హరిరాట్పుంగవుం
డాశ్చర్యభయహృదయుండయ్యుఁ గొండొక విచారించి యతం డట్టివాఁడు
గాడని దమనకుతోఁ జెప్పిన నక్కపటాత్ముండు వెండియు నిట్లనియె.

178


క.

ఉక్షపతి యొకఁడు మీకును
వీక్షింపఁ ప్రధాని యతఁడు వెరవున సర్వా
ధ్యక్షుండయ్యును కైతవ
దక్షుఁడు మదిలోన నమ్మఁదగదని మఱియున్.

179


వ.

మృగరాజా! వృషభంబు కృతఘ్నుండు చేసిన మేలెఱుంగని
వాఁడు వాని నమ్మరాదు నిన్నుం ద్రోసి రాజ నయ్యెదనని యున్నవాఁడు. ఇట్టి
కార్యమ్ము విన్నవాఁడనై నిప్పు ద్రొక్కిన ట్లదరిపడి నే నీకుం జెప్పవచ్చితి,
ప్రళయమ్ము వచ్చెనని నే విన్నవించుటయెల్ల, నీసంస్థానంబు చెడిపో, నేఁ
జూడజాలక సుమీ! యని విన్నవించి వెండియు నిట్లనియె.

180


క.

పతికన్న మంత్రి బలిసిన
క్షితియాతని దైతనర్చు సిద్ధము సతి దా
పతికంటె ఠవరయైనను
పతికార్యము చెడును నూతన భరతాచార్యా!

181


సీ.

రాజ్యరక్షకునిగా రాజు మంత్రిని నిల్పు
                    మంత్రి యాదక్షత మదము నొందు
నామదమ్మునఁ గార్య మాలస్యముగఁ జేయు
                    నటమీఁద స్వాతంత్య్ర మాత్మగోరు
స్వాతంత్య్రమున నిజేశ్వరున కొండు దలంచు
                    నంతట మతి వేఱె యగుచునుండు
నందుకుఁ బ్రతికర్మ మప్పుడు మఱచిన
                    వెనుకనంతటబోదు విగ్రహించుఁ


గీ.

గాన విషమైన భోజ్యమ్ము గ్రక్కవలయుఁ
దవిలి నొప్పించు దంతమ్ము దివియవలయు
మంత్రియును దుర్జనుండైన మాన్పవలయు
రాజనీతికి విఠ్ఠయ ప్రభుని లక్ష్మ!

182