పుట:పంచతంత్రి (భానుకవి).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ననంగశరమ్ముల నవయవమ్ము లెఱుంగక విటాన్వేషమ్మున మందగమన
మ్మున నాపరాంగన గృహాంత్యకుటీరమ్ము చేరి జారుం గౌఁగిలించికొని
యధరపానమ్మునం దేలి కలరవమ్ము లుల్లసిల్ల మన్మథయుద్ధమ్మునకు దాసె
నంత నక్కడ మేలుకొని.

145


క.

ఆతంతువాయుఁ డప్పుడు
నాతింబిలువంగ నది వినని యట్లుండన్
నాతోఁడ నలిగినావని
దూతిక నాసమ్ము కత్తి దూరిచి కోసెన్.

146


వ.

ఇట్లు, అంబష్ఠి ముక్కు గోసి క్రమ్మఱఁ గంకటిపై నిద్రించినంత నా
సాలెత విటకానితో నిష్టాభోగంబులం గేళి సల్పి వానిం బోఁబనిచి క్రమ్మఱ
నాత్మీయగృహమ్మునకు వచ్చి నాసికాచ్ఛిన్నయైన మంగలిం జూచి భయం
బున కడకటంబడి దాని కట్లు విడిచి వెండియుఁ దా కట్లం బడియుండియు నా
మంగలిదానింబోలె నేడ్చుచుండియుఁ దద్దూతికాంగనం గరసంజ్ఞం బోవం
బనిచిన నదియును నెత్తురు నాకికొనుచుఁ దలవరులకుం దప్పించుకొని తన
యింటి కరిగి గూఢభావమ్మున నుండునంత.

147


సీ.

ప్రాచీదిశావధూఫాలదేశమ్మునఁ
                    బొలుపొందు చంద్రంపుబొ ట్టనంగ
జంభాసురారాతి సౌధోపరిస్థితిఁ
                    గొమకారుకాంచనకుంభ మనఁగ
ప్రథమాచలేంద్రమ్ముపైఁ గనుపట్టి శో
                    భిల్లిన జేవుఱుగ ల్లనంగ
కోకవియోగాగ్నిఁ బోకార్చుటకు నెత్తు
                    సమయాభయశయాంబుజం బనంగ
చంద్రుఁ డపరాద్రిఁ జెర, భూజనులు నిద్ర
దేఱ, గలువలు ముకుళింప, వారిజాత
వితతి వికసింపం, జీఁకటి విరియఁ, గెంపు
మెరయ, మార్తండబింబమ్ము మింటఁ బొడమె.

148


వ.

ఇట్లు వేఁగు నవసరమ్మునఁ దంతువాయుని భార్య దంభనిద్రితుం
డగు ధవుని గుర్తించి వృథాక్రోశసమేతయై శపథమ్ముగా నిట్లనియె.

149