పుట:పంచతంత్రి (భానుకవి).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పడర, నటుగాక తక్కినఁ
దడబడుఁ గార్యములు తద్విధంబున దలఁపన్.

96


గీ.

కనకభూషణసముచితకమ్రమౌక్తి
కమ్ము లోహానఁ గట్టిన కరణి నధిక
[విధుల] పతి హితమతులందు వెలయుభటులఁ
గూర్చు సిరికన్య పురుషులఁ గూర్పఁజనదు.

97


చ.

జనవిభుఁ డజ్ఞుఁడైన పరిచారులు బుద్ధివిహీను, లట్టిచోఁ
బనులొనరింప నచ్చటికిఁ బ్రాజ్ఞులు చేరరు, నట్టివారు లే
మిని, బహునీతిశాస్త్రముల మేలు గ్రహింపగలేఁడు నీతిహీ
నుని నృపు నెంతవానిని మనుష్యులు రోఁతురు భూతలమ్మునన్.

98


ఆ.

ఘోరకాంతరాజగుణములచే నుప
జీవి సంతతికినిఁ జేరరాక
వచ్చుటయును గల్గి వనజంతుమణులచే
సుదధివోలె నధిపు డుండవలయు.

99


ఆ.

చైత్రచిత్రభానుచందమ్ము పెనుపొంద
వెట్టకోర్చి విభుఁడు వెతదలంప
కఖిలజనమహీరుహావళీహృదయముల్
చెలఁగి పల్లవింపఁజేయవలయు.

100


వ.

అని యివ్విధంబున [విన్నవించి] నిఖలమృగసేవితపాదాంబుజ
చతుష్క! నన్ను నీయందలి భక్తియుక్తుగా నెఱుంగుమని ఫేరనప్రవరుం
డిట్లనియె.

101


చ.

హరియును పోత్రిగాత్రధరుఁడై శరజన్ముఁడు ఛాగరూపియై
సరసిజబాంధవుండు హయసంహనుఁడయ్యు[ను మున్] మహేశ్వరాం
బురుహభవాదిదేవపరిపూజ్యులు గారె మృగేంద్ర! శౌర్యభా
సుర! నను నక్కమాత్రముగఁ జూడకుమీ మది నీకు బూజ్యుఁడన్.

102


వ.

అని పలికిన, బింగళకుండు మదీయప్రధానపుత్రుండవగు నీవు
పూజ్యుండవు [గాక] తిరస్కౌరార్హుండవే యనినఁ బ్రహృష్టమనస్కుండై
దమనకుం డిట్లనియె.

103