పుట:పంచతంత్రి (భానుకవి).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“చేసుక”, “నిర్మించుక” అను రూపములును, “రాజుకు”, “భూతలాధిపుకు” మున్నగు నగాగమవిరహితరూపములును గానవచ్చుచున్నవి. “దంష్ట్రించి” యను ప్రయోగము కనఁబడుచున్నది.

“వానగాలిచేత వడలెల్ల స్రుక్కెను”

ఒడలని సంస్కరించిన యతిభంగ మగును. దీనినిఁ గవి బుద్ధిపూర్వకముగనే వాఁడినట్లు తోఁచుట వలన నట్లే విడువఁబడినది.

ప్రథమాశ్వాసము 263 వ పద్యము

క.

“మృతి వొందినట్లు తెలిసిన
యతనిం బొడగాంచి వార లావల నిడి యం
చితగతిఁ జన నతిగర్విత
మనస్కుఁడై యా భవిష్యమతి యున్నంతన్.”

అను దానిలో నాలుగవచరణమునఁ బ్రాస భంగమైనది. ప్రత్యంతరము లేమిని సాధుపాఠమును బోల్ప ననువు పడలేదు.

“అతి గర్విత
మతి యగుచును నా భవిష్యమతి యున్నంతన్.”

అని చదివికొనిన సరిపడును.

గుణాభ్యర్హితమగు నీ కావ్యమున నిట్టి యల్పదోషములు పరిగణనీయములు కావు.