పుట:పంచతంత్రి (భానుకవి).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అసితుఁ డధోలోకమ్ముల
విశదమ్ముగఁ జూచి, మింటివీథులఁ జూడన్
వెసఁదిరుగుచు రథమెక్కియుఁ
గసుగు వడక వచ్చుచుండఁ గనె తనయన్నన్.

34


వ.

అట్లంబరతలమ్మునఁ—

35


ఆ.

చూచి మ్రొక్కి లేచి సురుచిరమ్ముగ మన
గురువు మంత్రశక్తి కుదురు కతన
నిట్టి భాగ్యమహిమ యింపుతో నబ్బెను
ననుచుఁ గౌఁగిలించుకొనుచు మఱియు.

36


వ.

అన్నా! మనగురువు చెప్పిన మంత్రమ్ము లొకరికొకరు విను
నట్లుగా నుచ్చరించవలయు, నీ మంత్రమ్ము నాకుఁ జెప్పుము, నా మంత్రమ్ము
నీకుఁ జెప్పెదనని పల్కి, పెద్దయగువాఁడు గూ యని చెప్పె, పిన్నయగువాఁడు
దా యని చెప్పె, రెండక్షరమ్ములు గూర్చి పలుకనది దుర్ధ్వనియైన, నయ్యిరు
వురు రోసి యిట్టి యాభాసమంత్రంబుల నీనీచుండు మన కెఱిగింపవచ్చునే!
యని గురువును నిందించిన నాయాకాశపథమ్మున నుండి యయ్యిరువురు
రథంబులతోడ, భూతలంబునం బడి చచ్చి యమలోకమ్మున కరిగి రంత.

37


సీ.

మొదల విశ్వాసమ్ము పదిలమై యుండంగ
                    నా మంత్రమునఁ గల్గె నమరచర్య,
పిదప విశ్వాసమ్ము పేఁదయై యుండిన
                    నామంత్రమునఁ జచ్చి రవనియందుఁ,
గావున గురువు నేకథను జెప్పిననైన
                    విశ్వసించుచు నుంట శాశ్వతంబు
నీవు ముంగిసమీఁద నెనరు లేకుండంగ,
                    నఘసంచయమ్ము ని న్నలమికొనియె


గీ.

మనుజుపుట్టువుఁ బుట్టి యేమనుజుఁడైన
నొనర నవుగాము లరయక యుండెనేని
శిష్యుచేతను గురువు చచ్చిన విధమ్ము
వచ్చు నతనికి నని చెప్పె వారిజాక్షి.

38