పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అతఁడు గొన్నిపూఁట లరిగిన నింటికిఁ, బోయి తాను ధర్మబుద్ధి కనియె
దిరుగఁ జూడవలదె దీనారభాండంబు, సురిగెనేమొ దిగులు సొచ్చె నాకు.

708


క.

అని దెరవుఁ జూపి పిలిచిన, ననుమానము పట్టి తాను నాతఁడు జోడై
చని ధర్మబుద్ధి వినిహిత, ధనభాండముఁ గానఁడయ్యెఁ దరుమూలమునన్.

709


ఉ.

కానక మాససంబు కలఁగంబడ నిట్లను ధర్మబుద్ధి య
య్యో నిను సద్వయస్యుఁ డని యొండొకచిత్తము లేక నమ్మి యి
చ్చో నిడి చన్న నాధనముఁ జోరునిచాడ్సునఁ బుచ్చుకొంటి వి
స్సీ నరభోజనుండయినఁ జెట్టఁ దలంచునె విశ్వసించినన్.

710


ఉ.

పూని మదీయవిత్త మిటఁ బూడ్చుతఱిం బరికింప నక్కటా
యేనును నీవకాని యెరులెవ్వ రెఱుంగరు నీవుదక్క నొ
ప్పౌ నిజమౌఁ బరుల్పొరయ రర్థముఁ గ్రమ్మఱఁ దెమ్ము దొంగబే
రానకుఁ బాలుపడ్డ నగరా నగరాలుదురాత్మ నావుడున్.

711


క.

విని దుష్టబుద్ధి బుద్ధిం, గనలుచు నద్ధర్మబుద్ధి గనుఁగొని పలికెం
గనివాఁడవొ వినినాఁడవొ, చనునే నామీఁద నిట్టిసడి మోపంగన్.

712


క.

నీసఖ్యమునఁ జరించిన, దోసము మోసమున నేఁడె తోడన కలిగెం
బోసరమొ నోరిక్రొవ్వో, రేసో యిట్లాడ నెవ్వరికి నీడేరున్.

713


ఉ.

ముచ్చుదనంబు నాపయిన మోపకయుండిన సెట్టిబిడ్డవే
వెచ్చునె నీకుఁ గూడుఁ గుడువం గులకామిని ప్రక్కఁ బండెదే
క్రచ్చఱఁ గన్నసొమ్ము తిరుగంబడినం గొనకున్న నెట్టురా
రచ్చకునంచు నీడ్చి పదరంబడి వాఁడు సుహృచ్ఛిఖామణిన్.

714


వ.

ఇట్లు ధర్మబుద్ధి నీడ్చుకొని చని నగరంబడి ధర్మంబున కొప్పి పిన్నపెద్దలం గూడ
బెట్టిన ధర్మవేదు లుభియవాదుల నాలోకించి తమకింపక ఱంతుసేయ కడ్డంబు సొ
రక యిరువురు గలసి పలుకక యొకరొకరిపూర్వోత్తరంబులు తెలియునట్లుగా
మీమీసుద్దు లుగ్గడింపుఁ డనుటయు నందు ధర్మబుద్ధి కృతాంజలియై సభవారి కిట్ల
నియె.

715


క.

ఈతఁడు నాతోఁ జెలికాఁ, డై తిరుగం బెద్దకాల మరిగే న్వినుఁ డీ
భూతలమున దీనారస, మేతవినిష్ఖండభాండ మేఁ గనుఁగొంటిన్.

716


క.

కనుఁగొని నిక్కము చెలికాఁ, డని పెద్దయు విశ్వసించి యీకథయే నీ
తనికి నతిగోపనంబుగ, వినిపించితి నావివిక్తి వీటింబోవన్.

717


క.

వినిపించిన నాతఁడు నా, కనురక్తునిపగిది ననియె ననఘా యేత
ద్ధన మూరియొద్ద నేటికి, నిను వేఁడెద వలయు నిచట నిక్షేపింపన్.

718