పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కులిశాయుధభీషణమై వెలిసిననాలావుఁ గనడొ వినడో నన్నుం
గొలిచినవాఁడని నిన్నుం, తెలియడొ సాగరుఁడు చూచితే తల క్రొవ్వెన్.

634


క.

అని యలుక మొలకలెత్త, న్వనరాశి న్గాసిసేయువాఁడై వినతా
తనుతాపహర్త చనఁగాఁ, గనుసన్న న్మాన్చి దైత్యఘస్మరుఁ డనియెన్.

635


క.

మామహిళాజనకుఁడు మా, మమ దుల్లసితకేళిమందిర మాప్త
గ్రామణిమణి నీరాకరుఁ, డామేటిం జెఱుప నుచితమా నీ కరుగన్.

636


క.

పలుకులనె చక్కఁజేయం, గలఁగలహం బేల కడలి కడవాఁ డా గొ
డ్డలి గోరఁ బోవుదానికి, వలె నా కన లుడుమమనిన వడి నమ్రుండై.

637


క.

ఉరగాంతకుఁ డనియె మహా, పురుషా నను గౌరవమునఁ బొందింపం దే
వరకుఁ దలఁ పున్న మత్కం, ధర నెక్కి పయోధి కరుగుతడ వేమిటికిన్.

638


చ.

కడుపునకా మహామహులఁ గాచుట గొల్చుట గౌరవంబునం
గడుఁబొడవై సుఖించుటకుఁగాక సముద్రునిచే లఘుత్వముం
బడసితి వ్యర్థమయ్యెఁ దలఁప న్దనజన్మము దేవ యెట్టియె
క్కుడు తనమేడలావు దనకు న్దల వంచుకొనంగ నోఁచితిన్.

639


మ.

అడరంగాదు సముద్రుఁ డిందిరకులాయం బంచు వారించి తు
క్కడగం దేవర నేను గానె తగులాయం బస్మదీయేప్సితం
బడుగం జెప్పితి సంఘటింపుడు మదీయస్కంధసంవాసివై
బడి విచ్చేయు మఖర్వనిర్వహణగర్వగ్రంధికి న్గంధికిన్.

640


క.

అని విన్నవించి వినతా, తనయుఁడు నికటమున నిలువ దనుజారి కన
త్కనకగిరిహేళిపోలెన్, ఘనతం దత్కంఠ మెక్కె ఖచరులు మ్రొక్కన్.

641


వ.

ఇట్లు గరుడారూఢుండై గగనంబున కుద్గమించి నిలింపులు గుంపులై కొలువ సుర
స్సద్మంబునం బద్మ యొప్ప నప్పరంధాముం డేతెంచి.

642


మహాస్రగ్ధర.

కలితాతిప్రీతిరీతిం గనియె బహుజలగ్రాహనిర్గాహధాటీ
చలపాతోత్పాతమీనాచరితపీతమహశ్చామరగ్రామపూజా
ఫలరేఖాపట్టభద్రుం బలరిపునగరప్రాంతవిశ్రాంతగంగా
లలనాసంశ్లేషభంగాలఘుకరనికరోల్లాసముద్రు న్సముద్రున్.

643


క.

కని కదియఁబోవుటయు న, వ్వనరాశి మహాపతంగవల్లభకంఠా
సనవర్తి నాదిమూర్తిన్, ఘనకీర్తి హృతాశ్రితార్తిఁ గని ముద మొదవన్.

644


క.

అకలంకరత్నములు గా, నుకలుగ జగదేకమోహినులు వాహిను లు
త్సుకలీల వెంటరాఁగా, మకరారిం జేరి సంభ్రమంబున మ్రొక్కెన్.

645


వ.

మ్రొక్కి నిలువంబడి కరంబులు మోడ్చి యిట్లని స్తుతియించె.

646