పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

లావును గలిగినవారలు, గావున మీతలఁపు లొప్పుఁ గద నేనన్న
న్మీవంటివాడఁ గాఁగద, యేవిధమున నిలుచువాఁడ నెక్కటి నిచటన్.

563


క.

అతివిమలపుణ్యమానస, యుతు లమలాకృతులు సుగతియోగ్యులు మఱి యా
శ్రితపక్షపాతు లకటా, హతమోహులభంగి నరుగనగునే మీకున్.

564


వ.

నా కెద్ది త్రోవ యని విన్నంబోయి యున్న గడుపునఁ జేయిడి కలంచిన ట్లగుటయు
మరాళంబులు గంబుగ్రీవు నూఱడించి.

565


క.

జడియకు మనఘా నీకుం, గడవారమె నిన్నుఁ బాయఁగా మాచిత్తం
బొడఁబడునె యొండుమాటలు, తడయక మాపనుపుఁ జేసెదవె యట్లయినన్.

566


క.

తరలక యేతత్కాష్ఠాం, తర మిఱియం బట్టు నిశితదంష్ట్రుల నది మే
మిరుగడలఁ గఱుచుకొని స, త్వర నాకాశమునఁ బఱచెదము నేఁ డొప్పన్.

567


చ.

అనఘ సరోవరాంతరమునం దిడునంతకు మానముద్రఁ గై
కొనవలయుంజుమీ యని సఖుం గమఠాగ్రణి నవ్విధంబునం
గొని యలవానజాలిపులుఁగు ల్గగనంబునఁ బోవ ద్రోవలో
చనమహమాచరించె విదిశానగరంబు సమగ్రసంపదన్.

568


క.

పరిఘలు గోటలు మేడలు, కరులు శతాంగములు హరులు కాల్బలములు భూ
సురులు భుజభవులు వైశ్యులు, చరణజులుం గలిగి యొప్పెసఁగు నవ్వీటన్.

569


క.

కరిబృంహితంబు లూఢ, త్వరపాకశికాశ్వహేషితంబులు రథ్యా
చరదఖిలజనరవంబులు, శరనిధి ఘోషించిన ట్లెసఁగ విని మింటన్.

570


వ.

కంబుగ్రీవుండు వికటసంకటంబులం జూచి.

571


క.

ఇల విననయ్యెడు నేత, త్కలకల మెఱిఁగింపుఁ డనినఁ గఱిచినదంష్ట్రల్
వెలువడిన కాష్ఠకాండో, ద్గళితంబై నేలఁ గూలి కమఠము పొలిసెన్.

572


క.

నీవును గంబుగ్రీవుని, కైవడి సుహృదుక్తియందు గాఢాదరముం
గావింపక చెడుద్రోవం, బోవుదు వని పలికి వల్లభున కది మఱియున్.

573


క.

పలికె నొకమడుఁగులోనం, గలదు ఝషత్రితయ మందు ఘననీతికళా
కలితములు రెండు తక్కిన, జలచర మతిమూఢతావశంగత మరయన్.

574


క.

నావిని టిట్టిభకము దన, దేవి నిరీక్షించి గుణవతీమణి చెపుమా
యావిధమంతయు వివరము, గా వేడుక ననిన నది మగని కిట్లనియెన్.

575


క.

ము న్నొకమడుఁగునఁ బ్రత్యు, త్పన్నప్రజ్ఞుం డనాగతవిధాతయు న
శ్యన్నీతి యద్భవిష్యుఁ డ, నన్నెగడు న్మూఁడుమీ లనఘ ఘనతరముల్.

576


సీ.

ఘనశిలాయుతమరుత్కపిలవిద్యుల్లేఖచండదావహుతాశసామిధేని
సమజమస్తకనగస్వరుపాతమహిమరుగ్జలజరాగమహోదశాణచక్ర