పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అట్లరిగిన నుల్లోకశోకం బగు కాకంబునకు జగత్ప్రసిద్ధుండగు నాప్రబుద్ధుం డాతి
థ్యం బాచరించి స్వాగతం బడిగిన నశ్రుమిశ్రితాక్షుండై వాయసాధ్యక్షుం డిట్ల
నియె.

285


చ.

ఘనవనమండలంబున నొకానొకభూమిరుహంబునందు నీ
యనుజయు నేను గాలిడుదు మచ్చెలి చూలు వహించి కాంచి పెం
చినపృథుకవ్రజంబుఁ గఱిచిల్వ దినుం బ్రతివత్సరంబు దా
ని నుడుపశక్తి లేక యొకనేర్పున నూరక చూచుచుండుదున్.

286


సీ.

నూఁగారువొదలు మేనులతోడ నెరకునై కిఱుకూత లిడ నాలకింపలేదు
అల్లంతఁ గాంచి యుల్లార్చుపక్షములతో శిరము లంకింప నీక్షింపలేదు
యెగుబోదలయి గూడు దిగనాడి పెఱమ్రాఁకు లెక్క నారసి యుత్సహింపలేదు
చంక్రమక్రమవిలాసముల నంబరవీథిఁ దిరుగఁ జిత్తమున మోదింపలేదు


తే.

ప్రేమ మెసలారఁ గని యెత్తి పెనుచుచుండ, ననుఁగుమనమలఁ దిగిచి ముద్దాడలేదు
బహువిపద్దశ లనుభవింపఁగ దినంబు, లరిగెఁ జూచితె వాయసాధ్యక్షుబ్రతుకు.

287


చ.

కడపితి నిట్టు లేను జిరకాలము చాలముదం బొనర్చు నే
పడఁతుక కాననయినయది పన్నగభీతి ధరించి యెవ్విధిం
జెడక సుఖింతు నిందులకు జెప్పు ముపాయము నావు డప్పు డ
య్యడ లడఁగించి జంబుకకులాగ్రణి వాయసభర్త కిట్లనున్.

288


క.

యీలీల నుత్తమముల, న్మీలం గాపట్య మెసఁగ మెసవికుభీరా
భీలగ్రహణమున పరః, కూలద్రుమవర్తి ముసలికొక్కెర దెగదే.

289


క.

అని చెప్పిన గోమాయువుఁ, గనుఁగొని వాయసము పలికెఁ గర్కటకముచేఁ
దనివిసన మీలజాలం, దిని కొక్కెర యెట్లు పొలిసెఁ దెలుపవె యనుడున్.

290


వ.

ప్రబుద్ధుం డిట్లనియె.

291


మ.

క్షణదాయామవిఘాతి భాస్కరమహస్సంపాతి విశ్వంభరా
ప్రణమత్కుంతము సింధువింధ్యకుధరప్రచ్ఛేత్తదావానలా
రణి నానామృగమస్తకద్రుమకుఠారం బధ్వనీనార్తికా
రణభైషజ్యము దోఁచె వేసవి మహోగ్రప్రేక్షణోదగ్రమై.

292


చ.

అడుగిడరాదు నేల నెరయం దలచూపఁగరాదు నిప్పుక
ల్జడిగొనరాలు నెండవడఁ జల్లెడుపిఁడిఁక నే డమిత్రుఁడం
చుడుగక భానుఁ జూచి వగనొందుశరీరులఁ దేర్పుగాడ్పు ల
ప్పుడు పరపోషణవ్రతులు వోఘనదానకళాధురంధరుల్.

293