పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఒకముగురు నిగురుగప్పిన, ప్రకటాంగారము లనంగ భస్మవిలిప్తాం
గకులు చనుదేర నారసి, తుకతుకపో నడచె నాపితుఁడు చేసేతన్.

59


క.

లగుడంబున మస్తకముల్, పగిలి పడ న్వ్రేయఁ జచ్చిపడి రెన్నఁగ న
మ్ముగురును ముగురు నిధిత్రయ, మగుటయు లే దవని మెఱసె నస్త్రము మెదడున్.

60


వ.

అట్టి యకృత్యంబునకుఁ బౌరు లాహాకారంబు లొనర్చి రాక్షణంబ నగరరక్షకులు.

61


చ.

పటురభసంబున న్బొదివిపట్టి దురాత్మక యిట్టివారి నేఁ
డిటువలె జేసి చంపుటకు నెవ్విధి నీమన సోర్చె వీరు ని
ష్కుటిలచరిత్రు లన్యులకుఁ గోర రొకింతయు గీడు వీరిపైఁ
గటకట మచ్చరం బెటులఁ గల్గె వృథా యిది పోల వెదెయ్యెడన్.

62


క.

నిటలలిఖితాక్షరంబులు, కుటిలాత్మా మసలదెసల గొనబగుజటులం
జటులగతిఁ జంపి తీ నవని, కటములు బొంగారఁ గ్రూరగతి వా రంతన్.

63


క.

ఆక్షురకుఁ డోడిపడ న, బ్భిక్షులపాదముల సరసఁబెట్టి భుజాహే
తిక్షతి దునిమిరి ధర నప, రీక్షితకార్యులు భజింపరే యాపదలన్.

64


చ.

ప్రశమనరేఖఁ బాదమునఁ బ్రామి యహో యవిశేషరోషసం
వశుఁ డగుచున్ ధరాస్థలి నవారణ నెవ్వఁడు వేగిరించి సం
భృశతరకార్యము ల్సలుపుఁ బెద్దయు వేయును నేల సర్వదు
ర్దశలు గలంచు వానిఁ దము దా గుణలుబ్ధులఁ బొందు సంపదల్.

65


వ.

కావున నీవును నాపితునకు దోడుబోయినవాడ వఐని ప్రాణేశ్వరుం దూఱె వారు
సుఖస్థితి నుండి రని విష్ణుశర్ముండు సెప్పిన విని నీతికథావర్ణనంబున సుదర్శనకుమా
రులు లబ్ధవర్ణులై పూర్ణులై తండ్రి నలరింపుచుండిరి.

66


మ.

సతతశ్రీభృతరాగదేహకృతయోషాభాగరత్నాస్థిదా
మతటిత్తారకయుక్తవారిధరసమ్యక్కాయచిద్గేయ ష
ణ్మతమోహావృతికర్తృకామహితగానప్రేమ గోపాంగనా
శతచామీకరచామరానిలచరాంచత్ఫాలలోలాలకా.

67


క.

హాటకమణినూపురనృక, రోటీకమలాప్తచరణరుచిరాగ్నిశిఖా
పాటీరభసితపల్లవ, పాటలమందారపాదపప్రతిమానా.

68


మాలిని.

త్రిపురరిపువరస్త్రీతీవ్రమానచ్ఛిదాధీ, నిపుణతరవిహారా నిత్యసంతోషపూరా
జపకరణచణార్యాసక్తముక్తాభిగమ్యా, త్రిపటుతనువిలాసా దివ్యధామైకవాసా.

69


గద్య.

ఇది శ్రీవేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసుకవి
స్తుతిభాషణోల్లాస రాజకులపారావారపర్వశర్వరీరమణ నీతిశాస్త్రమార్గపరిశ్రమణ
ధైర్యపర్యాయ ధిక్కృతనీహారపర్వత పర్వతరాజకుమార నిస్సహాయప్రబంధనిర్మాణ
భోజభూదారసుధామధుర భారతీసనాథ వేంకటనాథ ప్రణీతం బయిన పంచతం
త్రంబున నసమీక్ష్యకారిత్వ మన్నది సర్వంబును పంచమాశ్వాసము.