పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గింత పెట్టె నప్పుడు చతుర్ఘటికావిశేషంబుగా రాత్రి చనియె దిక్కులు ప్రకాశ
ప్రతతిం బొందెఁ బిచ్చుకలు పిచపిచ మనియఁ గాకంబులు గూకలిడియె దధిమ
థనఘుమఘుమధ్వానంబులు నెరసె గోవత్సకోలాహలంబులు విననయ్యె నయ్యెడ
గృహంబు వెడలి పెరడు చొచ్చి వచ్చుటకు విహారభద్రుండు పోయినఁ గనువేచు
కునియుండి.

504


క.

అపు డిచ్ఛావతి యచ్చో, నుపపల్లభు నిలువఁబనిచి యోడక యిలుసొ
చ్చి పొడవుగల మచ్చుపయిం, గపటవ్యాపార మమరఁగాఁ గూర్చుండెన్.

505


క.

హలికుం డాలోపల లో, పలికిం జనుదెంచి మచ్చుపైఁ దనయిల్లాల్
నిలిచిన తెఱఁ గెఱుఁగక యపు, డిలువెడలినబుద్ధి నిశ్చయించి కనలుతోన్.

506


ఉ.

ఈలువు వంగడంబు గల దీజవరాలని యోలి రొక్కరొ
క్కాలిడి యెట్టిఱంకుతడక న్వరియించితి దీని నక్కటా
చాలు సహింప దీచెనఁటిసంగతి యొండొకమాయ పన్నియో
యాలరిజంతఁ జంపి సుఖినై యొకదిక్కునఁ బెండ్లియాడెదన్.

507


వ.

అని హుమ్మని యౌడుగఱిచి మీసంబులు దీటుచుండ నయ్యండజయాన మచ్చు
డిగ్గ నుఱికి యెదుర నిలువంబడి యిట్లనియె.

508


ఉ.

ఈలువు వంగడంబు గలదే ముముబోంట్లకు నీకుఁ గాక రొ
క్కాలిడి యిట్టిఱంకుతడక న్వరియించుట రోఁత గాదె నీ
కేల సహింతు నన్ను మడియింపు మొకానొకచోటఁ బెండ్లిఁ గ
మ్మాలసె నీకు నేఁ దగుదునా చను నీ కిటులాడ నిచ్చలున్.

509


ఉ.

నిక్కము రెడ్డిబిడ్డవని నిన్మది నమ్మి గృహంబుఁ జేరి యీ
దిక్కున నున్నశూద్రసుదతి న్ముడుపిచ్చి రమించినాఁడ వి
త్తెక్కలిఱంకు నాకుఁ గలదే యని ముందలఁ బట్టి యీడ్చి యా
రక్కెస దన్నె ముక్కు చెదరం జరణంబున వాని నెవ్వడిన్.

510


ఉ.

తన్నిన వాఁడు తచ్చరణతామరసంబుల వ్రాలి నిన్ను నే
మన్నది లేదు నావలన నన్నియు నేరము లోర్చుకొమ్ము
పిన్నతనం బొకళ్లచెవిఁ బెట్టకు పెట్టిన సిగ్గువోవు నా
నన్నియసన్నమౌ నగరివారికి దండుగఁ బెట్ట ని మ్మగున్.

511


క.

చెఱుపకుము కాఁపురంబని, పఱిపరి యగుతాల్మి నట్లు ప్రార్థింపంగాఁ
గుఱఁగట నేగుచుఁ దలవరు, లరిమురి కర్షకునిమాట లాలించి తగన్.

512


క.

గిలుకలు వైచిన గుదియలు, ఘలుఘల్లున నూఁదికొనుచుఁ గదియం జని యా
హలికునిఁ గొని చని ధరణీ, తలవల్లభుమ్రోల నిలుపఁ దప్పేర్సడఁగన్.

513