పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వానిమస్తకమున వ్రాలి వాయసకులాగ్రణి కనుగ్రుడ్డులు గఱిచి పెఱికి
కొని తినువానిలాగునఁ గావుకావున నఱచుచు ముఱియించునంతలోన
నరుగుచున్నకిరాతుఁ డగ్రభాగమునఁ జిత్రాంగదుఁ గని మేనుపొంగ నురక


తే.

కలిగెఁ దెక తేర నేతన్మృగం బనుచును, మందరకు డించి కాకి బల్మఱు నదల్చి
కొనుచుఁ జనుచోట మూషకకులవిభుండు, కూర్మవల్లభుబంధము ల్కొరికివైచె.

234


క.

కొరికిన మందరకుఁడు దె, ప్పరపువడిం బఱచి సరసిఁ బడె మూషకరా
జురికె మృగవాయసంబులు, తెరఁగొప్పగ లేచి రెండుదిక్కుల కరిగెన్.

235


తే.

అట్లు విఫలప్రయత్నుఁడై యడవిఁ బాసి, విన్నబాటునఁ జనియెను వేఁటకాఁడు
కమఠమూషకమృగమహాకరటవిభులు, గాఢతరమైత్రిఁ బొదలి రుత్కంఠ నందు.

236


వ.

సుహృల్లాభంబున సాధింపరానికార్యంబులు గలవే యని సుదర్శనకుమారులకు విష్ణు
శర్ముం డెరింగించె నెరింగించిన.

237


క.

విని రాజకుమారకు లన, ఘు నయాంశవిలాసదివిజగురు నిజగురునిన్
గని మూఁడవతంత్ర ముపా, యనిధీ మాతోడఁ జెప్పుమని యడుగుటయున్.

238


మ.

అతికారుణ్యకటాక్షసర్వభువనైకాధ్యక్షరాధాసుత
ప్రతిపక్షప్రియచర్యకల్పకనిశారాడ్ఢుర్యచక్రత్రిశూ
లతిరోభూతరవిప్రభూతశుభలీలాపూతరూఢాంధకా
హితతేజోవిభవప్రచారణదయాహృష్టస్ఫురద్వారణా.

239


క.

మాయాతీతమహాసిత, కాయభటీకృతమరున్నికాయతపస్వి
ధ్యేయ నిజభక్తరక్షో, పాయ విభూతిప్రధానపాండిత్యనిధీ.

240


మాలిని.

నిరనుమితమహత్త్వానిశ్చలానందతత్త్వా, నిరతసుఖితలోకానిత్యపుణ్యావలోకా
గరుడవృషపతాకా ఖండితానన్యశోకా, మరణజననదూరా మౌనిచేతోవిహారా.

241


గద్యము.

ఇది శ్రీవేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసు
కవిప్రశంసాభాషణోల్లాస రాజకులపారావారపర్వశర్వరీరమణ నీతిశాస్త్రమార్గప
రిశ్రమణధైర్యపర్యాయధిక్కృతనీహారపర్వత పర్వతరాజకుమారనిస్సహాయ
ప్రబంధనిర్మాణభోజభూదార సుధామధుర భారతీసనాథ వేంకటనాథప్రణీతం
బైన పంచతంత్రంబునందు సుహృల్లాభం బన్నది ద్వితీయాశ్వాసము సంపూర్ణము.