పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సురగిరిసానుదేశమున సుస్థిరసంపద నుల్లసిల్లు కే
సరి యనువానిభార్య గుణశాలిని యంజన నాఁగ నొప్పుసుం
దరి యనిలప్రసాదమున ధర్మవిధి మహనీయమూర్తివి
స్ఫురితుఁ గుమారుఁ గాంచెఁ బరిపూర్ణతపోమహిమాభిరామ యై.

100


ఉ.

ఆతనిరక్షణంబున నరహర్నిశముం దగ సానధాన యై
యేతరుపండు లొప్పు నవి యేఱి వనంబునఁ దెచ్చి యిచ్చుచుం
బ్రీతిఁ జరించుచున్నెడఁ గపిప్రవరార్భకుఁ డొక్కనాఁడు ప్ర
ద్యోతనబింబముం బొడుచుచుండఁగఁ జూచి సముత్సుకాత్ముఁ డై.

101


చ.

ఫల మనుబుద్ధిఁ బుచ్చికొనఁ బాఱె నభంబున వాయుదేవుఁడున్
సలిలకణార్ద్రతం గిరణజాలమువేఁడిమి దాఁకకుండ నే
వలనను దాన యై పొదివి వచ్చెఁ దనూభవు నాఁడె పర్వ మై
జలరుహమిత్రుఁ బట్ట రభసంబున రాహును జేరె నత్తఱిన్.

102


క.

ఆసైంహికేయుఁ డర్క, గ్రాసాదరవృత్తి వచ్చు కపిఁ గనుఁగొని సం
త్రాసభరితమానసుఁ డై, వాసవుకడ కేగి ఖిన్నవదనుం డగుచున్.

103


క.

రవిశశిబింబగ్రహణోత్సవ మెల్లను నాకు ము న్నొసఁగి యెప్పుడుఁ జె
ల్ల విడిచి యుండుదు నేఁ డొకఁ, డవార్యవిక్రముఁడు వచ్చె నర్కునిఁ బట్టన్.

104


మహా.

అనినం గోపించి యింద్రుం డఖిలభువనమర్యాద లయ్యైవిధం ద
ప్పనిభంగిం జొప్పుతో నేర్పడ నడవఁగ నాపంపు గానీక యెవ్వం
డినబింబగ్రాహి యై యయ్యెడకు ముదముమై నేగుదెంచెం దదంగం
బనఘా మద్వజ్రధారాహతిఁ బొడిపొడి సేయంగ నే వత్తు నంచున్.

105


మ.

అనికిం బూని కరీంద్రు నెక్కి చను జంభారాతికిన్ ముందటం
జని తద్బాహుపరాక్రమంబున మహోత్సాహంబుతో సింహికా
తనయుం డాకపిబాలుపై నడరి యుద్యద్విక్రముం డైనయా
తనియాటోపము నోర్వఁజాలక విభీతస్వాంతుఁ డై పాఱినన్.

106


తే.

ఎగచికొనిపోయి కపి దివిజేంద్రుదంతి, వెనుక సొర నంటఁ దఱిమిన మనములోన
మెచ్చియును దన చేసినమేర తప్పు, నని తలంచుచు మృదురోషుఁ డై యతండు.

107


క.

భాసుర మగువజ్రంబున, వేసిన హనుదేశ మర్ధవిదళిత మైనం
గేసరితనూభవుఁడు మూ, ర్భాసంగతుఁ డై ధరిత్రిఁ జాఁగం బడియెన్.

108


క.

తనవచ్చినపని దీఱిన, ననిమిషపతి నాకమునకు నరిగెఁ దనయునిం
గనుఁగొని వేదనఁ బొంది ప, వనుఁ డప్పుడ యుడిపెఁ దనదువర్తన మెందున్.

109


ఆ.

జగములందు వాయుసంచార ముడిగిన, సకలజీవలోకసంకటంబు
పుట్టుటయు విరించి పురుహూతవరుణాది, సురులు బలసి కొలువ నరుగుదెంచి.

110