పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇవ్విధమున నింద్రుసుతుం, డెవ్వరు నెం దరుగుటయును నెఱుఁగక యుండం
గ్రొవ్వఱి తనసరివారలు, నవ్వుట కియ్యకొని పోయె నవిజృంభితుఁ డై.

111


క.

దనుజాధీశ్వరుతనయుం డనిమిషు లనుహంసముల రయంబునఁ బఱపం
దనయారుపుటెలుఁగున మే, ఘనాదుఁ డనుపేరు సార్థకంబుగఁ జేసెన్.

112


ఆ.

ఇట్లు దనతనూజుఁడే పేది సైన్యంబు, గాసి యగుడు నలిగి వాసవుండు
కెంపు గన్నులందు బెంపారుచుండఁ జెం, గలువకొలనిమాడ్కిఁ జెలువు మిగిలి.

113


ఉ.

మాతలిఁ జూచి దానవసమాజము దర్పము మీఱె నిత్తఱిన్
వాతజవంబునం గడఁగి వారక వీరికి సమ్ముఖంబుగా
వే తురగంబులం బఱపు విక్రమసంపద యుల్లసిల్లఁగాఁ
జేతులతీఁట వో నుఱుము సేసెద నెవ్వఁ డెదిర్చి వచ్చినన్.

114


క.

అనుచు నిజబలము నిలునిలు, మని కరతల మెత్తి నిలిపి యదలిచి సమరం
బునకు మగుడఁ బురికొల్పుచుఁ, దనచుట్టును నున్నదొరలు దానును గడఁగెన్.

115


చ.

ఎదురుగ వీచె నిష్ఠురసమీరము లుల్కము లుగ్రభంగి నె
ల్లదిశల డుల్లెఁ బెల్లుగ బలంబులపైఁ బెనుగ్రద్ద లాడె బె
ట్టిదముగ మ్రొగ్గి యభ్రకరి డిల్లపడెన్ వెస నందనంబు గ్ర
క్కదలఁగఁ గూసె నొక్కట సృగాలము లప్రియసూచకంబు లై.

116


క.

కలయంగ దుర్నిమిత్తం, బులు పుట్టినఁ గనియు వినియుఁ బొలివోవనియ
గ్గలిక మెయి నెమ్మనమ్మునఁ, దలఁ కొకయించుకయు లేక దర్పోద్ధతుఁ డై.

117


క.

సురపతి గడఁగుడు దనుజుల, బరవస మొక్కింత మట్టువడుటయు దశకం
ధరుఁడు సమరోత్సుకుం డయి, యరదము సన వసము గాక యత్యుగ్రముగన్.

118


క.

అమరవిభుం దలపడఁ జను, సమయంబున నడ్డపడియె సంభ్రమలీలన్
సమదుఁ డగు మేఘనాదుఁడు, దమతండ్రిరణంబు మాన్చి తాన కడంకన్.

119


చ.

తలపడి యింద్రుతోడ నతిదారుణయుద్ధము సేయఁ జొచ్చినన్
బలము బలంబుఁ దాఁకుటయు బాసటగా వడిఁ గుంభకర్ణుఁ డు
జ్వల మగుశూల మెత్తికొని వచ్చి యుగాంతపురుద్రుకైవడిం
జెలఁగుచు నార్చి మోహరము చెంగటఁ దాఁకె భయంకరంబుగన్.

120


క.

అడరి మొన లిక్కడక్కడ, వడిఁ దిరిగిన దిశలు బడలు వడ రౌద్రము చొ
ప్పడ బాహుశక్తి యేర్పడఁ, గడిమి పొగడ్తవడఁ గుంభకర్ణుఁడు పోరెన్.

121


క.

ప్రతివీరుఁ డొక్కరుఁడు లే, కతులబలుం డైనహీనుఁ డైనను నప్పా
ట తనకు గుఱిగా నురవడి,నతండు మునుకూడి సురల నందఱఁ దఱిమెన్.

122


ఆ.

ఎదిరి తేరినొగయు నిభముదంతంబును, దనకరంబుఁ బాదతలము లోను
గాఁగ నాయుధములు గానివి లే వయ్యె, నరివిమర్దనమున కతని కపుడు.

123