పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే,
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షా ద్రామాయణాత్మనా.

శ్రియఃపతియు నఖిలచరాచరంబులం బుట్టింపఁ బెంప గిట్టింపఁ గారణం బగు సర్వేశ్వరుండు నిఖలలోకరక్షణార్థంబు రవికులాభరణం బగుదశరథునకుం బుత్రరత్నంబై రామరూపంబున నవతరించి సాధుబృందంబులం గాచె.

అట్టిపురుషోత్తమునిదివ్యచారిత్రంబు యథావస్థితంబుగ నాదికవి వాల్మీకిమహర్షి సకలవేదాంతరహస్యార్ధప్రతిపాదకంబును, నైహికాముష్మికసుఖప్రదంబును నపర వేదం బనాఁ బరఁగు సప్తకాండపరిమితం బైనశ్రీరామాయణం బనుమహేతిహసం బొనర్చి లోకంబునకు మహోపకారంబు సేసె.

అందుఁ దొలుతటియాఱుకాండములలో శ్రీరామునిపట్టాభిషేకంబుదాఁక జరిగినకథయు, సప్తమకాండమునం బట్టాభిషేకంబునకుం దరువాతిరామనిర్యాణపర్యంత మగుకథయు వర్ణింపఁబడి యున్నది. సప్తమకాండమునకే యుత్తరకాండ మనియుం బేరు. దీనికథావైభవముంబట్టి మనభరతఖండంబునంద కాక జర్మని మున్నగుద్వీపాంతరంబుల నుండుకవీంద్రు లనేకులు నానాభాషలలో నాటకములుగను, బ్రబంధములుగను వెండియుఁ బెక్కుతెఱంగులఁ దత్తదభిరుచి కనుగుణంబుగా వ్రాసికొని యున్నారు.

ఈ చరిత్రవోలె లోకవిదితం బగుచరిత్రంబు కొంతదనుక భారతం బొండుదక్క వేఱొం డెద్దియఁఁ గానరాదు, పాతివ్రత్యము, శాంతి, దయ, సౌశీల్యము, మున్నగుసుగుణంబులచే విలసిల్లి సకలపతివ్రతాజనకాలంకారం బై యొప్పులోకమాత సీతం బోలుసతీరత్నంబును, పౌరుషము, పితృభక్తి, జనానురాగము, క్షాంతి, కారుణ్యము మున్నగులోకోత్తరంబు లగుకల్యాణగుణంబుల కాకరం బైనశ్రీరాముం బోలుపురుషోత్తముండును మఱియొక్కం డెచ్చట నేని లేఁ డనుట సర్వజనవిదితము.

ఇట్టిమహాపురుషచరిత్రం బనర్లళకవితావిభాసితు లగుభాస్కరతిక్కనాదులకుఁ దెలుంగుబాసఁ బ్రబంధంబుగా రచియించుభాగ్యంబు లభించుట యాంధ్రభాషాభిమాను లగునస్మదాదులపుణ్యంబ కాని వేఱు గాదు. ఈచరిత్రంబును మొట్టమొదట మంత్రిభాస్కరుం డనుమహాకవి యాంధ్రీకరించె. ఇదియ భాస్కర