పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సుతులఁ గొనియాడు విద్వ, త్ప్రతతి నుపాసించు భూమిప్రజ నరయు మహా
క్రతువు లొనరించు గురుదై, వతపూజలు సేయు సాధువర్గముఁ బ్రోచున్.

159


తరలము.

ధరణి నెందును గాలవర్షము దైవయోగసమగ్ర మై
గురియ మోదముఁ బొంద సస్యము కోటికొండలు పండ ధ
ర్మరతి సర్వజనంబు నుత్తమమార్గవర్తనశీలతం
బొరయ ధారుణి యేలె రాఘవపుంగవుండు మహోన్నతిన్.

160

ఆశ్వాసాంతము

మ.

మురజిత్కల్పుఁడు కల్పవృక్షకుసుమామోదప్రతీకాశకీ
ర్తిరమాధాముఁడు ధామమాలితులనాశ్రీపాత్రతేజోనిరం
తరదిక్చక్రుఁడు చక్రభృత్పదయుగధ్యానక్రియాభ్యాసత
త్పరతానిత్యుఁడు భవ్యకృత్యుఁ డసమాచార్యుండు సౌమ్యుం డిలన్.

161


క.

మనుజాభ్జాకరసవితృఁడు, వినయస్తవనీయవిభవవిశ్రుతనిజవ
ర్తనుఁడు పరివాహసన్నా, హనబిరుదాంకుండు శస్వదభివిజయుఁ డిలన్.

162


మాలిని.

ధరణిభరణదృప్యత్పార్థివార్థప్రకాండా
హరణపరిణతుం డుద్యద్గుణాఢ్యక్షితీంద్రా
భరణకరణగాథాపండితోద్యత్సదావి
స్ఫురణవరణనిత్యస్తుత్యలక్ష్మీశుఁ డుర్విన్.

163


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర, బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందు సర్వంబును దశమాశ్వాసము.

నిర్వచనోత్తరరామాయణము

సంపూర్ణము

————

చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
‘వావిళ్ల’ ప్రెస్సువ ముద్రితము.