| చ. |
జయజయశబ్దముల్ సెలఁగ సర్వజనంబు నెలర్ప నర్మిలిం
బ్రియసుతయుగ్మముం దిగిచి పెద్దయుఁబ్రొ ద్దొగిఁ గౌఁగిలించి మో
దయుతమనస్కుఁ డై నృపతి దమ్ముల సమ్మద మొందఁ జేసి య
న్వయపరివృద్ధి తల్లులమనం బలరం బ్రకటించి వేడుకన్.
| 147
|
| క. |
నగరం బుత్సవరమ్యం, బుగ నప్పు డలంకరింపఁ బుచ్చి సముచితం
బుగ సకలజనముఁ బొమ్మని, తగువారును మునివరుండు దమ్ములుఁ దానున్.
| 148
|
| క. |
కొడుకులతపస్వివేషము, లుడిపి నరేశ్వరకుమారయోగ్యపరికరం
బొడఁగూర్చి వార లుచితపు, నడవడి వర్తిల్లఁ గ్రతుదినంబులు సనినన్.
| 149
|
| క. |
ధరణీసురగణము మునీ, శ్వరులను భూపతుల నర్థివర్గము నయ్యై
వెరవున సంభావించుచుఁ, బరువడి వీడ్కోలిపె రఘునృపాలుం డెలమిన్.
| 150
|
| తే. |
వినయ మొప్పంగ వాల్మీకమునికి నచ్చ, లిచ్చి మీకృపపెంపున నెల్లవగలుఁ
బాపి నాహ్లాద మొనఁగూడె భవదనుగ్ర, హంబ మాకేడుగడయును ననుచు నతని.
| 151
|
| క. |
అనుచుటకును బెద్దయుద, వ్వనుగమనము సేసి భక్తి నడుగులఁ బడి వీ
డ్కొని యమ్మునిసత్తముదీ, వనలం బ్రీతాత్ముఁ డగుచు వచ్చెం బురికిన్.
| 152
|
| తే. |
ఇట్లు కృతకృత్యుఁ డగు రాఘవేంద్రు నెల్ల, వారు నయ్యైవిధంబుల వచ్చి కాంచి
మన్ననలు మున్నుగాఁ దమవిన్నపములు, సఫలములు సేయఁ దోషితస్వాంతు లైరి.
| 153
|
| క. |
తనకన్నప్రజయ కాఁ గైకొని భూప్రజ నెల్ల నొక్కకొఱఁతయు లేకుం
డ నడపి పాలించుచు న, మ్మనుజేంద్రుఁడు పూజ్యరాజ్యమహిమాన్వితుఁడై.
| 154
|
కుశలవులకు రాముఁడు రాజవిద్యలు నేర్పించుట
| క. |
మునులకడఁ దత్ప్రకారం, బున నునికిం జేసి ము న్నపూర్వం బని నం
దనులకు నుచితపరిశ్ర ను, మొనరించువిధంబునకు సముత్సుకుఁ డగుచున్.
| 155
|
| సీ. |
భరతవాత్స్యాయనప్రభృతి నాగరికశాస్త్రంబులదెస నైపుణంబు వడయ
హయగజస్యందనాద్యారోహణక్రియాదక్షతవలన వైదగ్ధ్య మొందఁ
గోదండకరవాలకుంతముఖ్యాయుధశ్రమములయందుఁ బ్రశస్తి నొంద
వేణువీణాప్రౌఢవివిధకళాభ్యాసములయెడఁ బ్రాశస్త్యములు వహింపఁ
|
|
| తే. |
జేసి తజ్జ్ఞులమనము లచ్చెరువడంగ, నక్కుమారుల నొక్కొక్కయవసరమున
నేర్పు మెఱయించి ముదము దలిర్ప శిక్ష, కులకుఁ బసదన మొసఁగు నిట్టలము గాఁగ.
| 156
|
| క. |
ఇత్తెఱఁగునఁ గుశలవులు ను, దాత్తపరిశ్రములఁ జేసి తద్విమలగుణా
యత్తమతిఁ జేసి శస్త్రా, ద్యుత్తమబాణములవిధము లుపదేశించెన్.
| 157
|
| ఆ. |
సర్వకార్యములను శత్రుఘ్న లక్ష్మణ, భరతు లరసి తీర్ప ధరణియెల్లఁ
బొగడుతోడియాజ్ఞ నెగడి ప్రవర్తిల్ల, నతఁడు సద్వినోదరతిఁ జరించు.
| 158
|