పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

దశమాశ్వాసము



సంపాదికటాక్షవి
లాసుఁడు బాహావధానలంపటుఁడు గళా
వాసమతి దీనజనర
క్షాసక్తుఁడు మనుమసిద్ధిజగతీశుఁ డొగిన్.

1


క.

రేపకడ నక్కుమారుఁడు, దాపసవరు వీడుకొని ముదంబున విప్ర
జ్ఞాపితపథమునఁ దత్స, ల్లాపరసాయత్తుఁడై బలంబును దానున్.

2

మునులు శత్రుఘ్నునకు లవణుని వధించునుపాయం బెఱింగించుట

చ.

చని చని విప్రులన్ లవణుజన్మము వానిభుజాబలంబు వాఁ
డనికిఁ గడంగుచందమును నద్దనుజాధముమర్మముం గ్రమం
బున నడుగంగ వారు మధుపుత్రుఁడు వాఁడు మహాబలాఢ్యుఁ డె
వ్వనికి రణంబునం జెనయ వచ్చునె యాతని నంచు వెండియున్.

3


ఆ.

అద్దురాత్ముజనకుఁ డగు మధు వెంతయు, నరిదితపము సేయ హరుఁడు మెచ్చి
యొక్కనిశితశూల మొసఁగి యద్దానవు, హృదయకమల మలర నిట్టు లనియె.

4


క.

ఇది యొకవాటున నని నీ, కెదిరినవీరునిఁ గృతాంతునేనియు నాఁ డా
మదనునిఁ గోపించిననా, నుదుటియనలశిఖగతిం దనువుపొడ వడఁచున్.

5


క.

క్రమ్మఱ నప్పుడు నీహస్తమ్మున కేతెంచు నల్పశత్రునిపైఁ గో
పమ్మున వైవకు మీ లో, కమ్ముల భస్మమ్ము సేయుఁ గావున దీనిన్.

6


చ.

అనుడుఁ బ్రమోద మంది యతఁ డాగిరిజాహృదయేశుతోడ ని
ట్లనియె భవద్వరంబునఁ గృతార్థుఁడ నైతి మదీయవంశసం
జనితుల కెల్ల నీపరమసాధన మట్టుల చెల్ల నిమ్ము భ
క్తనికరకైరవాకరసుధాకర భూరిదయా ప్రియాకరా.

7


క.

అనవుడు నటులే లగు నీ, మనోరథం బగ్గలంబు మానుము దానిం
దనయుఁడు గల్గినవానికి, బని సేయుం గాక యనియె భవుఁ డాతనితోన్.

8


తే.

అమ్మహాశూల మిప్పు డీయసురయొద్ద నునికి నెవ్వరు నెదురంగ నోప రతని
నయిన నీచేతఁ జచ్చు నన్యాయవర్తి, గాన దాని కుపాయంబు గలదు వినుము.

9