పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఇట్లు సల్లాప మొనరించి యెల్లపనులు, ననుదినంబును దలఁపింపు మఖిలజనులు
సంతసం బందునట్లుగాఁ జక్కఁ బెట్ట, నని నియోగించి యతనిఁ బోఁనిచి విభుఁడు.

82


ఉ.

అచ్చటు వాసి యల్లఁ జని యాహ్నికవర్తన మాచరించి రా
లచ్చి వికాస మందఁగ నలంకృతుఁ డై మునిమాపు దర్శనం
బిచ్చిన మంత్రిభృత్యసుకవీశ్వరు లాదిగ నెల్లవారలున్
వచ్చి మహీశుఁ గొల్చి రనివారణఁ జిత్తము లంకురింపఁగన్.

83


ఆ.

విభుఁడు నిఖిలజనులవిన్నపంబులు విను, వివిధసైన్యములకు సవరణముల
ననువు సేయు నభిమతార్థంబు లర్థుల, కిచ్చు వేఁట లాడు నిచ్చవెలయు.

84


క.

ఇవ్విధమున నిత్యంబును, నవ్వసుధాధిపుఁడు ప్రజల కనురాగలతల్
నివ్వటిలఁ జేయుఁ దనమది, నొ వ్వెఱుఁగక యుండ బహువినోదపరుండై.

85

రాముఁ డేకాంతంబున సీతం దలంచి చింతిల్లుట

క.

మనమునఁ బాయని ధరణీ, తనయవలని వగల నేకతంబ పొగిలి య
మ్మనువంశదీపకుం డి, ట్లను ధైర్యము పల్లటిల్లి యలుగులపడుచున్.

86


సీ.

నీకకా యకట పినాకిబాణాసనం బద్భుతంబుగ సభ నట్లు సేసి
జనకానుమతిఁ దపంబునకు నక్కట నీవు ననుగమనంబు సేయంగ నరిగి
పాసియు మగుడ నిన్ బడయుదు ననునాస నక్కట ప్రాణంబు చిక్కఁ బట్టి
యక్కడ సేతుబంధాద్యుపాయములు నానందనం బయిన నీపొందు గాంచి


తే.

యిం పొసంగు నీయర్మిలియెల్ల వమ్ము, గాఁగఁ దుది పోయి ని న్నిట్లు గానపాలు
నేసేసి యాఱడిఁ బుచ్చితిఁ జెప్పఁ జిట్ట, లయ్యె నామను వే మన నంబుజాక్షి.

87


ఉ.

అచ్చట లోకమంతయును నక్కటికంబున నుమ్మలింప నీ
చిచ్చు చొరంగఁ బోక మది చిక్కఁదనంబున నియ్యకొన్న నా
కిచ్చటఁ దెచ్చి నిన్ విడుచు టెంతటి పెద్దజఘన్యవృత్తి కే
నచ్చట రచ్చ కెక్కుటకు నాఱడిపోకకు నోర్తు మైథిలీ.

88


ఆ.

అని దురంతశోకమునఁ బొంది సెజ్జపై, మేను వైచి కన్నుగోనలందు
నివుడు నశ్రువారి చెవులకొలంకుల, నిండ నిట్టు లను విభుండు మఱియు.

89


ఉ.

వీట దురాత్ము లైనయవివేకులు గొంద ఱనింద్య మైనయ
జ్జోటిచరిత్ర మంగనల చొప్పుగ సంశయ మంది యాడు పె
న్మాటల కేల యీదురభిమానము పూనితి వాని నేల నే
గీటునఁ బుచ్చ నైతిఁ బరికింపక చేసితి నింతిఁ బాసితిన్.

90


ఉ.

లోకమువారిమెచ్చునకు లోలవిలోచనఁ బాఱవైచితిం
బో కొఱగామి యంతటన పోయెనె దీనికి నింకఁ గొంద ఱో
హో కృప మాలి చేసె నిది యొప్పదు పొ మ్మని దుర్వినీతి గాఁ
గైకొని రేని వారిమది కందున కెయ్యది గందు దైవమా.

91