పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బొరయనియట్ల కెంజిగురుఁ బ్రో వొడఁ గూర్తురు చూత మంచు న
న్నరపతియుం దలోదరియు నర్మవచోరచనార్ద్రచిత్తు లై.

28


చ.

అలరులఁ గోయుచున్ మధుకరావళిఁ జోపుచుఁ గీరపోతకం
బులపలు వాఱు మాటలకుఁ బొంచుచు నంచలఁ బట్టఁ దారుచున్
లలితమయూరనర్తనవిలాసముఁ జూచుచు బోటిపిండుతోఁ
గలయుచుఁ బాయుచున్ బహులకౌతుకవృత్తి రమించి రెల్లెడన్.

29


సీ.

తీఁగెయుయ్యెల లెక్కి తూఁగియాడుచుఁ గూడి పాడెడు మత్తాళిబాలికలను
బలుకులతోడన యలవడఁ దొడఁగియు నేరనికీరకుమారికలను
నింపారు లేఁదూడు లేఱి పిల్లలకుఁ బెట్టుచు నున్నహంసకుటుంబినులను
ఫలరస మొండొంటి కెలిమిఁ జంచుల నించు తఱిఁ జొక్కుకోకిలదంపతులను


తే.

జూచి చూచి యొండొరులకు జూపి చూపి, చెలుల కెఱిగించి కొనియాడి చెప్పి చెప్పి
చిత్తహారివిహారసంసేవఁ దగిలి, యుల్లసిల్లిరి వనితయు వల్లభుండు.

30


ఉ.

అల్లవె లెస్సపువ్వు లని యందనిగుత్తులదిక్కు సూపి తా
నల్లన చేరి నేను నెగయ న్నిను నెత్తెదఁ గోయు మంచు భూ
వల్లభుఁ డాదటం బొదివి వామవిలోచన నెత్తెఁ దత్తనూ
వల్లికతోన మైఁ బులకవర్గము కాముఁడు నారు వోయఁగన్.

31


చ.

నవకపుమావిమోకులఁ బెనంగినతీవలు వేడ్కఁ బెంపఁ బ
ల్లవములసెజ్జ లుల్లముల లజ్జ లడంపఁగఁ దేటితండముల్
దివుటలు ముంపఁగా సమదలీల మనోజవినోదసక్తు లై
యవసరసేవ మెచ్చి మలయానిలు సౌరభధన్యుఁ జేయుచున్.

32


ఆ.

ఇవ్విధమునఁ బతియు నెలనాఁగయును వివిధప్రకారలీలఁ దగిలియుండఁ
జెలులఁ గేలివనము గలయంగఁ జొచ్చి నె, మ్మనములందుఁ గోర్కికొనలు నిగుడ.

33


చ.

అలరులు గోయుచోట మధుపావళిమ్రోఁతకు ముగ్ధ లుల్కినం
గలకల నవ్వుచుం దొలుతఁ గైకొని మవ్వపుఁదీఁగె లాగి పు
వ్వు లొరులు గోయ నింకఁ దలఁపుం డని యొప్పుగ జంకె సేయుచున్
లలిఁ దమలోన మత్సరములం దుదికొమ్మలగుత్తు లందుచున్.

34


సీ.

మావిలేమోకల మవ్వంపుఁదీవలఁ జెన్నొందఁ బెండ్లిండ్లు సేసి చేసి
పలుదెఱంగుల క్రొవ్విరులు నేర్పు వాటించి తోడవులు గావించి తొడివి తొడివి
పతులను బ్రియలఁ గా భావించి పొదరిండ్ల నిక్కలుగాఁ జేసి యేగి యేగి
చెట్టుపల్ నెఱయని చిలుకబోదులఁ బట్టి తెచ్చి బిడ్డలుగఁ జ న్నిచ్చి యిచ్చి


తే.

బొదివి పుప్పొళ్లు సల్లియుఁ బువ్వుఁ దేని, యలఁ బదంపడి తడిపియు నలి వసంత
మాడి యాడి యుద్యానవిహారలీల, సలిపి రంభోరుహానన లెలమి మిగుల.

35