పుట:నారాయణీయము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43


దోయి, నీ దరికేగుదెంచు, అదుగో గోచరమయ్యె మున్నగు పద్యములలో తెలుగుందన మాస్వాద్యమే కాని యూరక చెప్పిన తనివితీరు టెట్లు? 69 వ దశకము రాసక్రీడలోని పద్యము లన్నియు భావానుగుణములై , రసోన్మాదముతో, శబ్దార్థ సమైక్యతలో సమసించినవి. మన మనస్సులు కూడా 'కుతుకాకులమ్ము' లగుచున్నవి. ఆపిదప తత్త్వబోధనలో కూడ కవి తన చేయి నవలీలగా నెత్తి, కథా విపంచిలో శృతిని గల్పినాడు ; "ఏమే మబ్బిన నీక యర్పితము తండ్రీ !" యనుటలో శరణాగతి పరాకాష్ఠను వర్ణించినాఁడు. ఆ శ్రీకృష్ణుని “కృపా కల్లోలస్మితమునకు ముగ్ధుఁడై, నారాయణభట్టుతో తాదాత్మ్యమొంది, యతఁ డనని మంత్రరహస్యమును బయలు వెట్టుచు, “నాలీన శ్రీరశనాలలన్మణిగణ క్లీం కింకిణి నిస్వనుం"డగు భగవానుని కవి ధ్యానించినాఁడు. గ్రంథము మంగళాష్టకముతో శాంతించినది. శ్రీ గురుకృప కవి కృతి కొక సోయగము సంపాదించి పెట్టినది.

సహృదయులగు పాఠకులకు నతులితానంద సంధాయకంబు, శబ్ద బ్రహ్మ కళోపాసనాధానుము నగు నారాయణీయాంద్రీకృతి సార్థకము, రసోల్లసితము, మధురభావ బంధురము, దివ్యధారా శృంగార సముజ్జ్వలమునై యలరారు చున్నదనుట నిస్సంశయము. మనమును కవితోపా టిట్లందము గాక !

“కురుతా మాయు రనామయం కృతిరియం వో బ్రహ్మ విద్యాం శ్రియం"

స్వకపోల కల్పిత కథారచయితలకు సుప్రయోజ్య శబ్దస్ఫూర్తి, రమణీయార్థ విస్తృతి, వివిధభావావిష్కరణానుగుణ రససంపూర్తి యావశ్యకములు. ఒక్కభావములు తప్ప తక్కినవన్నియు సదనువాదులకు గూడ నావశ్యకములే కదా ! భావములు మార్చుట కనువాదులకు నాంద్రీకరణ కర్తలకు, నభిలషణీయముకాదు, కాని యాద్యగ్రంథములోని యున్నతిని, మధురిమను, నూతన భాషలోనికి వడపోయుట సామాన్యకార్యము కాదు. వాల్మీకి రామాయణము నేటికిని సమగ్ర రామణీయకతతో తెలిగింపబడలేదన్న నసత్యోక్తికాదు, కాన సరియైన "తెలిగింపు- (తొలి కావ్యములోని వలపులు మలి కావ్యమున నుండునట్లు సేత). సులభసాధ్యము కాదు. అయినను దుర్ఘటమగు నీ యత్న మీ యాంధ్ర నారాయణీయ కర్త కవిఘ్నముగ నెఱవేరినది. కావ్యము మనోహరముగాసాగిపోయి, కవిరాజు సిద్ధహస్తమును జయమాల యలంక రించినది.

ఓం స్వస్తి