పుట:నారాయణీయము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12


అను సమాసమునకుఁ జేసిన తెనుఁగులోను స్ఫురించుచున్నది. సుకుమార పద రచనముతో, గంభీరము మనోహరమునగు భావముతో వెలువడిన యీ తెలుగు పద్యము కమ్మచ్చునఁ దీసిన బంగరుతీఁగ వలె మెఱసిపోవుచున్నది. ధేనుకాసురవధ ఘట్టమున, “కడచి బాల్యమ్ము మిసిమిపౌగండమూని, చిన్ని తువ్వాయులన్ గాచు చిన్నిపనికిఁ, జొరక గోలోకముం గాచు చొరవఁ బూనినావు భువనైక పరిపాలనావినోద !" అను పద్యమునందు 'ఉపేత్య పౌగండవయో మనోజ్జమ్' అను మూలమునందలి మనోజ్ఞ శబ్దమునకు బదులు 'మిసిమి' అను చిన్న తెలుఁగు పదము బ్రయోగింపఁబడియు, 'ఉపేక్ష్య వత్సావసమ్' అను దళము 'చిన్ని తువ్వాయులన్ గాచు చిన్నిపనికిఁ జొరక' అని మృదు మధురముగఁ దెలిఁగింపఁబడియుఁ గావ్యమున కొక యపూర్వ శోభ గూర్పఁబడినది. 'తువ్వ' తువ్వాయి పదములు లేఁబ్రాయపు బిడ్డల పలుకుబడిలోనివి. అది యిచటఁ బ్రయు క్తమగుట యెంతయు రమణీయమై “బొజ్జ తిరిగిరాదయ్యె జగజ్జాలము లున్న బొజ్జఁ గట్టఁగ వశమే” అను పోతనార్యుని వత్సల రసద్యోతకమగు బొజ్జ పదమును జ్ఞప్తి కెలయించుచున్నది.

“పవనపురనాథ ! నీదు ప్రవర్తనమ్ము, వక్రమమునకు సమనురూపముగ నడచెఁ, బూని గోత్రాపరిత్రాణమునకు నవత, రించితివికాదె యదె యుద్యమించి తీవు"అను నీ పద్యము పై పద్యమువలెఁ గాక యథామూలమనువదింపఁ బడినది. “గోత్రా పరిత్రాణకృతే౽వతీర్ణ స్తదేవ దేవా౽రభథా స్తదా యత్” అను మూలమందలి గోత్రా శబ్దము యథాతథముగాఁ బ్రయోగింపకున్న ('గవ్యా గోత్రాగవాం' అను) గోసముదాయార్ధమును, ("గోత్రా కుః పృథివీ పృథ్వీ' అను) భూమ్యర్థమును శ్లిష్ట మొనర్చుట కష్టమగుటయే కాదు, భ్రష్టమును గూడ నగునుగాదా ? గోత్రాపరిత్రాణమునకు అనఁగా భూలోక రక్షకై యవతరించితివి కాన గోత్రాపరిత్రాణము అనఁగా గోసముదాయ రక్షణ మాచరించితివి అను చమత్కృతిని దెలుపుటకే యీ పద్యము సొగసు చెడకుండ స్వయంభువము వలెఁ దెలిఁగింపఁబడినది, కాళియానుగ్రహసందర్భమున,

"కుండల మండలమ్ము తళుకుల్ గులుకన్ గులికించి పన్నగా
 ఖండలుమీఁదఁ దాండవ మఖండగతిన్ బొనరింపఁ నింగియం '
 దుండి విలింపకాంతలు నహో మఱి పాడిరి యాది దేవతా
 మండలి దుందుభిధ్వని సమంచిత మంగళఘోష మీనఁగన్"

అను పథ్యమును బరిశీలింతము. దీనికి మూలము.